Gujarat: అధికారంలోకి వస్తే రుణమాఫీ.. గుజరాత్‌ రైతులపై ఆప్‌ వరాల జల్లు

గుజరాత్‌లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని ఆమ్ఆద్మీ పార్టీ ప్రకటించింది.

Published : 02 Sep 2022 21:18 IST

ద్వారకా: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు హామీలు గుప్పిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రచారాన్ని ముమ్మరం చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ.. రైతులపై వరాల వర్షం కురిపించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ద్వారకాలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. కనీస మద్దతు ధరతోపాటు 12 గంటల నాణ్యమైన కరెంటు  అందిస్తామని హామీ ఇచ్చారు.

‘ఏటా కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ.. ఆ ధరకు పంటలు అమ్ముడు పోవడం లేదు. ఎంఎస్‌పీ ధరకు ప్రైవేటు వ్యక్తులు కొనకుంటే తామే వాటిని గ్యారెంటీగా కొనుగోలు చేస్తాం. భాజపా ప్రభుత్వం ఇటీవల జరిపిన భూముల సర్వేపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మళ్లీ సర్వే చేపడతాం’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. వీటితోపాటు రైతుల రుణాలను కూడా మాఫీ చేస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయానికి రాత్రి పూట మాత్రమే విద్యుత్‌ అందిస్తున్నారని.. తాము అధికారంలోకి వస్తే పగటిపూట అందిస్తామన్నారు. అది కూడా 12 గంటలపాటు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తామన్నారు. విపత్తుల కారణంగా పంటనష్టం జరిగితే ఎకరాకు రూ.20వేల నష్టపరిహారాన్ని అందిస్తామన్నారు.

గుజరాత్‌లో అధికారంలోకి వస్తే రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ, రోజుకు 10 గంటల ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇటీవలే ప్రకటించింది. వీటితోపాటు వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువకు కొనడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకువస్తామని గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగదీశ్‌ ఠాకోర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని