Kejriwal: దిల్లీతో ఆగదు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆర్డినెన్సులు వస్తాయి: కేజ్రీవాల్‌

దిల్లీ (Delhi) పరిధిలోని గ్రూప్‌-ఏ అధికారుల అంశంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం నిరంకుశత్వానికి నిదర్శనమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విమర్శించారు. రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Published : 11 Jun 2023 23:27 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని పరిధిలో గ్రూప్‌-ఏ స్థాయి అధికారుల అంశంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇది కేవలం దిల్లీతో ఆగిపోదని.. భవిష్యత్‌లో అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్‌ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్‌ తీసుకురావడం దిల్లీ ప్రజలను తక్కువ చేయడమేనని ఆయన అన్నారు. కేంద్రం తీరు చూస్తుంటే దిల్లీలో ప్రజాస్వామ్యం లేదని అర్థమవుతోందని ఆరోపించారు.

‘‘ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరుతూ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నా.. దిల్లీ ప్రజలు ఎప్పటికీ ఒంటరివాళ్లు కాదు.. 140 కోట్ల మంది ప్రజల మద్దతు వాళ్లకు ఉంది. కేంద్రం వంచనకు గురైన తొలి రాష్ట్రం దిల్లీ కావొచ్చు. కానీ, చూస్తూ ఊరుకుంటే.. ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాలకు వస్తుంది.’’ అని కేజ్రీవాల్‌ హెచ్చరించారు. దేశ రాజధానిలో అభివృద్ధి పనులను అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. కానీ అభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకు తమ దగ్గర సిసోదియా, జైన్‌ లాంటి వాళ్లు వందల మంది ఉన్నారని, అభివృద్ధి అంటే ఏంటో వాళ్లే చూపిస్తారని చెప్పారు. ‘‘ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా చాలా ఏళ్లు పని చేశారు. కానీ, నేను సీఎం బాధ్యతలు తీసుకొని కేవలం 8 ఏళ్లే అయ్యింది. మా ఇద్దరిలో ప్రజల కోసం ఎవరు ఎక్కువ పని చేశారో మోదీ చెప్పగలరా?’’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

దిల్లీ పరిధిలోని గ్రూప్‌-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కోసం కేంద్రం జాతీయ రాజధాని సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి దిల్లీ ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గతంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా ఉందని దిల్లీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు పరచాల్సిందేని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాటు పలువురు మంత్రులు గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీని కోసం ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని