Updated : 10 Jul 2021 17:18 IST

తప్పు చేశాం: కిమ్‌ అరుదైన ప్రకటన..

అంగీకరించిన ఉ.కొరియా నియంత..

సియోల్‌: కొత్త సంవత్సరం సందర్భంగా రెండున్నర కోట్ల ప్రజలకు లేఖలు రాసి.. ఆశ్చర్యపరచిన ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. తాజాగా అటువంటిదే మరో అరుదైన ప్రకటన చేశారు. తమ దేశ ఆర్థికాభివృద్ధి ప్రణాళిక విఫలమైందని ఇటీవల జరిగిన అధికార వర్కర్స్‌ పార్టీ సమావేశంలో కిమ్‌ స్వయంగా అంగీకరించారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఏడువేల మంది పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరూ మాస్కులు ధరించకపోవటం గమనార్హం. ఆ దేశ చరిత్రలో ఈ విధమైన సమీక్షా సమావేశాలు కేవలం ఎనిమిది సార్లు మాత్రమే జరగ్గా.. ఈ ఐదు సంవత్సరాల్లో ఇదే తొలిసారి.

విఫలమయ్యాం..
కిమ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం తొలిరోజున.. గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పనితీరుపై సమీక్షను నిర్వహించారు. దాదాపు అన్ని రంగాల్లో లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమయ్యామని కొరియా నియంత ఈ సందర్భంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. తాము చేసిన తప్పలు, అనుభవాలు, పాఠాలు వంటి అంశాలను గురించి లోతైన విశ్లేషణ చేయాలని కిమ్‌ సూచించారు. అయితే తప్పులు చోటుచేసుకున్నది అమెరికాతో సంబంధాలా లేదా ఇంకేవైనా అనే సంగతిని మాత్రం ఆయన కచ్చితంగా పేర్కొనలేదు.  

ఒంటరైన ఉత్తర కొరియా..
అమెరికా అధ్యక్షుడిగా  జో బైడెన్‌ కొద్ది రోజుల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. కిమ్‌ నుంచి ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. కొరియా నేత కిమ్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య ఆంక్షల సడలింపుకు సంబంధించిన చర్చలు నిలిచిపోవడంతో.. వాషింగ్టన్‌, ప్యోంగాంగ్‌ల మధ్య సంబంధాల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. కమ్యూనిస్టు చైనాతో మరే ఇతర దేశాలతో కూడా ఉత్తరకొరియాకు సత్సంబంధాలు లేవు. ఇక కరోనా కట్టడి కోసం దేశ సరిహద్దుల్ని పూర్తిగా మూసివేయాలన్న కిమ్‌ నిర్ణయంతో మరింత ఒంటరైన ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది.

ఈ నేపథ్యంలో కిమ్‌ వ్యవహార శైలిని గమనిస్తే అమెరికాతో  సంబంధాలు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇకనైనా దేశ అంతర్గత వ్యవహారాలు, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి..  స్వావలంబనను సాధించే దిశగా ఉత్తర కొరియా కొత్త ఆర్థిక ప్రణాళిక రచించే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.

ఇవీ చదవండి..

న్యూ ఇయర్‌లో కిమ్‌ చర్య..

ట్రంప్‌ మరో కీలక నిర్ణయం..

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని