Long Covid: దీర్ఘకాల కొవిడ్ లక్షణాలేంటీ.. వైద్యులు ఏమంటున్నారు..?

కరోనా మహమ్మారి చాలా మందికి రోజుల్లోనే నయమవుతున్నా.. కొందరిని మాత్రం దీర్ఘకాలం.. వారాలు, నెలల కొద్దీ విడవకుండా వేధిస్తోంది. దీనివల్ల వారు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు

Published : 16 Apr 2022 13:22 IST

దిల్లీ: కరోనా మహమ్మారి చాలా మందికి రోజుల్లోనే నయమవుతున్నా.. కొందరిని మాత్రం వారాలు, నెలల కొద్దీ విడవకుండా దీర్ఘకాలం వేధిస్తోంది. దీనివల్ల వారు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాల కరోనాతో బాధపడేవారిలో చాలా వరకు శ్వాస సంబంధిత సమస్యలతో పాటు కండరాల బలహీనత, బరువు తగ్గడం, కంటిచూపు సమస్య వంటి లక్షణాలు ఉంటున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుతున్నవారు ఎంతమంది అనే దానిపై ఇప్పటివరకూ అధికారిక సమాచారం లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా 10-20శాతం మంది కరోనా బాధితుల్లో వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా దీర్ఘకాలం కొవిడ్‌ ప్రభావం ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ముఖ్యంగా 25 - 50 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఈ లాంగ్‌ కొవిడ్‌ బారిన పడుతున్నారని గుజరాత్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్‌ డాక్టర్‌ రాకేశ్‌ పండిత్‌ తెలిపారు. గరిష్ఠంగా ఆరు నెలల పాటు ఈ సమస్య వేధించొచ్చని చెబుతున్నారు. ‘‘కొవిడ్‌ సమయంలో వెంటిలేటర్‌ సాయం తీసుకున్నవారిలో ఇప్పుడు ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాడీ వ్యవస్థ, కిడ్నీలు, జీర్ణాశయ పేగులపైనా ఈ లాంగ్‌ కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపిస్తోంది’’ అని ఆయన అన్నారు.

దీర్ఘకాల కొవిడ్ బారిన పడిన వారిలో అత్యంత తీవ్రమైన లక్షణం శ్వాసకోశ సమస్య అని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు కండరాలు బలహీనంగా ఉండటం, మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం, జుట్టు ఊడటం, కంటిచూపు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటున్నట్లు తెలిపారు. కొంతమంది 15-20 కేజీల బరువు కూడా తగ్గినట్లు డాక్టర్‌ రాకేశ్‌ పండిత్‌ తెలిపారు. సుదీర్ఘకాలం పాటు కరోనా వేధిస్తున్న వారిలో గుండె చప్పుడు పెరగడం, ఒత్తిడి, ఆందోళన, నిల్చున్నప్పుడు కళ్లు తిరగడం వంటి సమస్యలు కూడా ఉంటున్నట్లు చెప్పారు.

ఇప్పటివరకు దీర్ఘకాల కొవిడ్‌కు ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదు. అయితే పెయిన్‌ కిల్లర్లు, మల్టీ విటమిన్లతో పాటు, ఫిజికల్‌ థెరపీ, యోగా వంటి వాటితో ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. లాంగ్‌ కొవిడ్‌ సమస్య ఎదుర్కొంటున్నవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు డైట్‌ పాటించాలని చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని