‘అమర్త్యసేన్ ఇంటిని తాకితే ఊరుకోను’.. యూనివర్సిటీకి మమత వార్నింగ్

నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ విషయంలో విశ్వభారతి విశ్వవిద్యాలయానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Published : 06 May 2023 23:51 IST

కోల్‌కతా: ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు (Amartya Sen) పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అండగా నిలిచారు. ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ అమర్త్యసేన్‌కు విశ్వభారతి విశ్వవిద్యాలయం షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ‘అమర్త్యసేన్‌ ఇంటిని తాకితే ఏమి చేస్తానో నాకే తెలియదు’ అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఆయన ఇంటిని ధ్వంసం చేస్తే అక్కడకి వెళ్లి కూర్చుంటానని హెచ్చరించారు. విశ్వభారతి యూనివర్శిటీ చర్యను ఏమాత్రం తాను సహించేది లేదని మమతా బెనర్జీ చెప్పారు. అమర్త్యసేన్‌కు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె సూచించారు. యూనివర్సిటీ చర్యకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించారు.

అమర్త్యసేన్‌ నివాసం ఉంటున్న 1.38 ఎకరాల విస్తీర్ణంలో చట్టపరంగా ఆయన భూమి కేవలం 1.25 ఎకరాలు మాత్రమేనని, మిగతా భూమిని ఆయన ఆక్రమించుకున్నారని విశ్వభారతి విశ్వవిద్యాలయం ఆరోపిస్తోంది. మిగిలిన 13 సెంట్ల భూమిని ఖాళీ చేయాలని సూచించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టుకు చేరింది. ఈ విషయంలో దిగువ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసే వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదంటూ కలకత్తా హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. మే 10న దిగువ న్యాయస్థానంలో విచారణకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని