Landslide: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. కొండచరియలు ఎలా విరిగిపడ్డాయో చూడండి!

శ్రీనగర్-జమ్ము (Srinagar-Jammu) జాతీయరహదారిపై కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయింది. దీనికి సంబంధించిన దశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 29 Apr 2023 00:23 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని బనిహల్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శ్రీనగర్‌-జమ్ము జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రెండు రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం ఇది రెండోసారి. రోడ్డుకు అడ్డంగా బురదతో కూడిన మట్టిపెళ్లలు పడిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. చరియలు విరిగిపడుతున్న సమయంలో అటువైపుగా వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న వారు వీడియోతీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.

ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్ముకశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. నిరంతరం రద్దీగా ఉండే శ్రీనగర్‌-జమ్ము జాతీయ రహదారిపై ఇటీవల కొండ చరియలు విరిగిపడటంతో వందలాది మంది చిక్కుకు పోయారు. దేశంలోని ప్రముఖ ప్రాంతాలతో కశ్మీర్‌ను అనుసంధానించడంలో భాగంగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా పర్వత ప్రాంతంలో నేలను చదును చేసేందుకు.. బుల్డోజర్ల సాయంతో మట్టిని తవ్వుతున్నారు. దీనివల్ల పర్వతసానువుల్లో నేల వదులుగా మారి.. కొండచరియలు విరిగిపడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని