Mehul Choksi: డొమినికా ప్రతిపక్షనేతతో రహస్య డీల్‌!

వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తమ్ముడి ద్వారా డొమినికా ప్రతిపక్షనేతతో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఛోక్సీ సోదరుడు చేతన్‌

Published : 03 Jun 2021 10:38 IST

తమ్ముడి ద్వారా రాయబారం

డొమినికా: వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తమ్ముడి ద్వారా డొమినికా ప్రతిపక్షనేతతో రహస్య ఒప్పందం కుదుర్చుకొన్నట్లు తెలుస్తోంది. ఛోక్సీ సోదరుడు చేతన్‌ చింటుభాయ్‌ ఛోక్సీ.. ఇటీవల డొమినికా విపక్ష నేత లెనాక్స్‌ లింటన్‌ను ఇటీవల రహస్యంగా కలిసినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఛోక్సీని భారత్‌కు అప్పగించకుండా డొమినికా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ఇలా చేస్తే వచ్చే ఎన్నికల ఖర్చుకు నిధులు ఇస్తామని చేతన్‌ హామీ ఇచ్చినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. 

ఛోక్సీకి బెయిల్ నిరాకరణ

డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీకి బెయిల్‌ ఇచ్చేందుకు అక్కడి న్యాయస్థానం నిరాకరించింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఛోక్సీకి బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరఫున న్యాయవాది కోర్టును కోరారు. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీనిపై తదుపరి విచారణను జూన్‌ 14వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్‌ తిరస్కరణపై పైకోర్టుకు వెళ్తామని ఛోక్సీ లీగల్‌ టీం తెలిపింది. మరోవైపు ఛోక్సీ కోసం ఆయన న్యాయవాది వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై గురువారం మరోసారి విచారణ జరగనుంది. 

ఛోక్సీని భారత్‌కు అప్పగించే విషయమై డొమినికా అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. అతడు ఆర్థిక నేరగాడని, అతడిని భారత్‌కు అప్పగించాల్సి ఉందని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ఆంటిగ్వా వెళ్తానని ఛోక్సీ పెట్టుకున్న అభ్యర్థనకు విచారణార్హత లేదని పేర్కొంది. ఆయన పారిపోయే అవకాశం ఉన్నందున బెయిల్‌ ఇవ్వొద్దని ప్రభుత్వం కోర్టును కోరింది. దీనిపై తదుపరి విచారణ గురువారం జరగనుంది. ప్రస్తుతం ఛోక్సీ పోలీసు భద్రత నడుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

రూ. 13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్‌ మోదీ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణం బయటకు రాకముందే ఆంటిగ్వా పారిపోయిన ఛోక్సీ.. అక్కడి పౌరసత్వాన్ని వినియోగించుకొని నివశిస్తున్నారు. అయితే గత నెల 23న ఆయన ఆంటిగ్వా నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కాడు. ఛోక్సీని బలవంతంగా కిడ్నాప్‌ చేసి డొమినికా తీసుకెళ్లారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఛోక్సీని భారత్‌కు తీసుకొచ్చేందుకు దర్యాప్తు సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని