Modi: ఆ చిన్నారిని కలిశాక.. నాలో విశ్వాసం పెరిగింది: మోదీ

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘డిజిటల్‌ భారత్‌’ వారోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ 11 ఏళ్ల దివ్యాంగ చిన్నారితో ముచ్చటించిన ప్రధాని.. ఆ బాలుడ్ని చూసి

Updated : 05 Jul 2022 11:09 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘డిజిటల్‌ భారత్‌’ వారోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ 11 ఏళ్ల దివ్యాంగ చిన్నారితో ముచ్చటించిన ప్రధాని.. ఆ బాలుడ్ని చూసి ముచ్చటపడిపోయారు. ఆ చిన్నారిని కలిశాక.. ఈ దేశం ఎక్కడా ఆగిపోదని తనలో విశ్వాసం మరింత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

డిజిటల్‌ ఇండియా వారోత్సవాలను ప్రారంభించిన ప్రధాని.. అక్కడ ప్రదర్శనకు ఉంచిన పలు నూతన ఆవిష్కరణలను తిలకించారు. ఈ సందర్భంగా థింకర్‌బెల్‌ ల్యాబ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న 11 ఏళ్ల ప్రథమేశ్‌ సిన్హాతో ప్రధాని ముచ్చటించారు. ఈ సంస్థ అంధులు బ్రెయిలీ లిపిని సులభంగా నేర్చుకునేందుకు వీలుగా ‘యాన్నీ’ అనే గ్యాడ్జెట్‌ను తయారు చేసింది. ప్రథమేశ్‌ ఈ పరికరం గురించి ప్రధానికి వివరించాడు. అతడు చెబుతున్నంతసేపు ఎంతో ఆసక్తిగా విన్న మోదీ.. ‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్‌?’ అంటూ చిన్నారిని అడిగాడు. ‘పుణె నుంచి వచ్చాను’ అని చెప్పగా.. మోదీ చిన్నారి తలనిమిరి అభినందించారు.

అనంతరం మోదీ ప్రసంగిస్తూ ప్రథమేశ్‌ గురించి ప్రస్తావించారు. ‘‘నేను ఆ బాలుడితో మాట్లాడినప్పుడు అతడు.. ఆ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ తనను తాను పరిచయం చేసుకున్న తీరు నన్ను అబ్బురపర్చింది. ఇలాంటి వాళ్లను కలిసినప్పుడే.. ఈ దేశం ఎక్కడా ఆగిపోదని, భవిష్యత్తు కలలను సాకారం చేసుకుంటుందని నాలో విశ్వాసం మరింత పెరుగుతుంది’’ అని మోదీ ఆ చిన్నారిని అభినందించారు.

ఈ వీడియోను థింకర్‌బెల్‌ ల్యాబ్స్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ..‘‘విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మేం ఈ పరికరాన్ని రూపొందించాం. చదువుకోవాలనుకునే చిన్నారులకు వైకల్యం అడ్డు కాకూడదు. ప్రథమేశ్ లాగే.. ఎంతోమంది అంధ చిన్నారులకు యాన్నీ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గ్యాడ్జెట్‌ గురించి ప్రథమేశ్‌ ప్రధానికి వివరించడం మాకు చాలా గర్వంగా ఉంది’’ అని రాసుకొచ్చింది. ఈ వీడియోను భాజపా కూడా తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఎవరీ ప్రథమేశ్‌..

పుణెకు చెందిన ప్రథమేశ్ పుట్టుకతోనే అంధుడు. కానీ ఆ లోపాన్ని అధిగమించి తన టాలెంట్‌తో ఎంతోమంది దృష్టిని ఆకర్షించాడు. గతేడాది తాను ప్రచారకర్తగా ఉన్న థింకర్‌బెల్‌ ల్యాబ్స్‌ తరఫున ప్రముఖ షో షార్క్‌ ట్యాంక్‌లో పాల్గొన్నాడు. అక్కడ ‘యాన్నీ’ గ్యాడ్జెట్‌ గురించి అతడు ఇచ్చిన ప్రజెంటేషన్‌తో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నాడు. ఈ ప్రొగ్రామ్‌ చూసిన బోట్‌ (boAT) లైఫ్‌స్టైల్‌ సీఈఓ అమన్‌ గుప్తా.. ప్రథమేశ్‌ను తన ఆఫీసును ఆహ్వానించారు. అంతేగాక, ఒకరోజు బోట్‌ సీఈఓగా పనిచేసే అద్భుత అవకాశమిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని