Venkaiah Naidu: ఎంపీలైనా తప్పించుకోలేరు.. ఖర్గేకు వెంకయ్య నాయుడి కౌంటర్‌

పార్లమెంట్ ​సమావేశాలతో సంబంధం లేకుండా.. దర్యాప్తు సంస్థల విచారణకు హాజరుకావాలని రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు

Published : 06 Aug 2022 01:33 IST

దిల్లీ: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈడీ విచారణకు పిలవడం సరైనదేనా అంటూ.. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు పరోక్షంగా కౌంటర్‌ వేశారు. పార్లమెంట్ ​సమావేశాలతో సంబంధం లేకుండా.. దర్యాప్తు సంస్థల విచారణకు హాజరుకావాలని సూచించారు. పౌరులుగా అది మన బాధ్యత అని గుర్తుచేశారు. ఎంపీలైనా ఇందుకు మినహాయింపు కాదన్నారు. పార్లమెంటు​ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా, లేకపోయినా.. ఎంపీలు దర్యాప్తు సంస్థలు పిలిచే విచారణలకు హాజరుకావాలి. చట్టాలను, న్యాయ ప్రక్రియను గౌరవించడం మన బాధ్యత. చట్టాన్ని అమలు చేసే సంస్థల సమన్లను ఎంపీలైనా తప్పించుకోలేరు’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

ఇటీవల రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేయడం పట్ల గురువారం సభలో దుమారం చెలరేగింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ఖర్గే ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ను భాజపా భయపెట్టాలని చూస్తోందని, కానీ తాము భయపడబోమని పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా కేంద్రం.. దర్యాప్తు సంస్థలను వాడుతోంది. ఈడీ చర్యలపై కేంద్రం సమాధానం చెప్పాలి. నాకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ నుంచి సమన్లు అందాయి. నేను చట్టానికి లోబడి ఉంటాను. కానీ, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈడీ విచారణకు పిలవడం సరైనదేనా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాసాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఎంత వరకు సబబు? మేం భాజపాకు భయపడం. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడతాం’ అని ఖర్గే అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని