అంబానీ ఇంటివద్ద వాహనం పెట్టింది వాజేనే

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని నిలిపింది పోలీసు అధికారి సచిన్‌ వాజేనే అని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ బుధవారం ధ్రువీకరించింది.

Published : 17 Mar 2021 17:45 IST

ధ్రువీకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని నిలిపింది పోలీసు అధికారి సచిన్‌ వాజేనే అని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ బుధవారం ధ్రువీకరించింది.  సీసీటీవీ దృశ్యాల్లో పీపీఈ వేసుకున్నట్లుగా కన్పించిన వ్యక్తి వాజేనే అని వెల్లడించింది. అయితే అది నిజంగా పీపీఈ కిట్‌ కాదని పేర్కొంది. 

‘‘సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. సచిన్‌ వాజే ఓ పెద్ద హాండ్‌కర్చీఫ్‌తో తన ముఖాన్ని కవర్‌ చేసుకున్నారు. ఆయన వేసుకున్నది పీపీఈ కిట్‌ కాదు. తన బాడీ లాంగ్వేజ్‌, ఫేస్‌ను ఎవరూ గుర్తుపట్టకూడదని పెద్ద సైజు కుర్తా, పైజామా ధరించారు’’అని ఎన్‌ఐఏ తమ నివేదికలో తెలిపింది. వాజే అరెస్టు తర్వాత ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో ఓ లాప్‌టాప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో డేటాను అప్పటికే డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. సెల్‌ఫోన్‌ గురించి అడిగితే అది ఎక్కడో పడిపోయిందని వాజే చెప్పినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. 

ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిచి ఉండటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. ఆ వాహనాన్ని నిలిపిన వ్యక్తి పీపీఈ కిట్‌ వేసుకున్నట్లుగా కన్పించింది. ఆ దృశ్యాలపై తాజాగా ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టగా.. ఆ వ్యక్తి వాజేనే అని తేలింది. 

ముంబయి పోలీస్‌ కమిషనర్‌పై వేటు

ఇదిలా ఉండగా.. ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌పై వేటు పడింది. ఆయనను హోంగార్డ్‌ డీజీగా బదిలీ చేస్తున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ బుధవారం వెల్లడించారు. పరంబీర్‌ స్థానంలో హేమంత్‌ నగ్రాలేను ముంబయి కొత్త కమిషనర్‌గా నియమించినట్లు ప్రకటించారు. పరంబీర్‌ గతేడాది ఫిబ్రవరిలోనే కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం వ్యవహరంలో పోలీసు అధికారి సచిన్‌ వాజే అరెస్టు అవడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు వేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని