Odisha: ఏఎస్సై కాల్పుల ఘటన.. తూటా గాయాలతో ఒడిశా ఆరోగ్య మంత్రి కన్నుమూత

ఒడిశాలో ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన మంత్రి నవ కిశోర్‌ దాస్‌(61) ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒడిశాలో విషాదం నెలకొంది.

Updated : 29 Jan 2023 21:36 IST

భువనేశ్వర్‌: ఒడిశా(Odisha)లోని బ్రిజరాజ్‌నగర్‌లో ఆదివారం ఉదయం ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్‌ దాస్‌(Naba kisore Das)(61) కన్నుమూశారు. ఛాతీ భాగంలోకి తూటా దూసుకెళ్లడంతో చికిత్సపొందుతూ ఆయన ప్రాణాలు విడిచినట్టు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తొలుత ఆస్పత్రికి తీసుకురాగానే డాక్టర్‌ దేబాశిస్‌ నాయక్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం హుటాహుటిన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. ఆయన శరీరంలోకి దూసుకెళ్లిన ఓ బుల్లెట్‌.. గుండె, ఎడమ వైపు ఊపిరితిత్తుల భాగంలో గాయం చేయడంతో అధిక రక్తస్రావం జరిగిందని వైద్యులు వివరించారు.  

ఓ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్‌ నగర్‌లోని గాంధీ చౌక్‌ వద్దకు చేరుకున్న మంత్రి నవకిశోర్‌.. వాహనం దిగుతున్న సమయంలో ఏఎస్సై గోపాల్‌ దాస్‌ కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన మంత్రిని ఎయిర్‌ లిఫ్ట్‌ ద్వారా భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యులతో కూడిన బృందం ఆయనకు చికిత్స చేసినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయంత్రం కన్నుమూశారు. మంత్రి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అపోలో ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా.. కాల్పులకు పాల్పడిన ఏఎస్సైని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, అతడి మానసిక పరిస్థితి సరిగాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఆయన మరణంతో ఒడిశాకు తీరని నష్టం: ఒడిశా సీఎం సంతాపం

మంత్రి నవ కిశోర్‌ దాస్‌ మృతి పట్ల ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను తీవ్ర షాక్‌కు, ఆవేదనకు గురిచేసిందన్నారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేయాల్సిందంతా చేశారని.. కానీ దురదృష్టవశాత్తు ఆయన రికవరీ కాలేకపోయారన్నారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి ఆయన గొప్ప ఆస్తిఅని.. ఆరోగ్యశాఖలో అనేక కార్యక్రమాలను విజవయంతంగా నిర్వహించి ప్రజలకు లబ్దిచేకూరేందుకు కృషిచేశారని కొనియాడారు. క్షేత్రస్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన నవకిశోర్‌ దాస్‌.. బిజూ జనతాదళ్‌ పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఆయన్ను గౌరవించేవారన్నారు. ఆయన మరణం ఒడిశా రాష్ట్రానికి తీరనిలోటన్నారు. నవ కిశోర్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

బిజూ జనతాదళ్‌లో సీనియర్‌ నేత అయిన నవకిశోర్‌ దాస్‌.. మహారాష్ట్రలోని శని శింగణాపుర్‌ దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. మంత్రిపై దాడులు జరగడం అటు పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యింది. అయితే, ఒడిశాలో ఎన్నికల సమయంలో ఇటువంటి హింసాత్మక ఘటనలు తరచూ జరుగుతుంటాయని.. ఇవి ఆందోళన కలిగించే విషయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు