Oxygen-Related Death: సేకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో ఒక్కరే మృతి: కేంద్రం

కొవిడ్‌ రెండో ఉద్ధృతి సమయంలో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరే  అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్ వివరాలు వెల్లడించారు. అంతకుముందు దేశంలో

Published : 10 Aug 2021 23:52 IST

దిల్లీ: కొవిడ్‌ రెండో ఉద్ధృతి సమయంలో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరే  అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్ వివరాలు వెల్లడించారు. అంతకుముందు దేశంలో ఆక్సిజన్‌ కొరత కారణంగా సంభవించిన మరణాల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని రాష్ట్రాలను కోరినట్టు ఆయన తెలిపారు. అయితే ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం కేవలం ఒక రాష్ట్రంలోనే ఆక్సిజన్‌ కొరత కారణంగా ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. కానీ ఆ రాష్ట్రం పేరును ఆయన బహిర్గతం చేయలేదు. మిగిలిన రాష్ట్రాలేవీ అలాంటి మరణాలకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదని చెప్పారు.

ఆక్సిజన్‌ కొరత కారణంగా కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి సమయంలో.. అనుమానాస్పద స్థితిలో చోటుచేసుకున్న మరణాల వివరాలను ఈ నెల 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోగా అందజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. అయితే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు 13 రాష్ట్రాలు వివరాలను సమర్పించినట్టు సమాచారం. ఆ వివరాల ప్రకారం.. ఆక్సిజన్‌ కొరత కారణంగా పంజాబ్‌లో పలువురు కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారని అనుమానిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆక్సిజన్‌ కొరతతో దేశంలో ఎలాంటి మరణాలూ చోటుచేసుకోలేదంటూ ఇటీవల పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్రాలు తమకు వివరాలేవీ సమర్పించలేదని పేర్కొంది.

కొవిడ్ సెకండ్ వేవ్‌లో వైద్యపరమైన వనరులు.. ప్రత్యేకించి ఆక్సిజన్‌కు సంబంధించి దేశం సంక్షోభం ఎదుర్కొన్న నేపథ్యంలో కేంద్రం తాజా ప్రకటన వివాదాస్పదమైంది. ఎంతోమంది ప్రాణవాయువు అందక చనిపోయారు. ఆ సమయంలో అత్యవసర వినియోగం కింద ఆక్సిజన్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని