Modi: 10 రెట్లు పెరిగిన ఆక్సిజన్‌ ఉత్పత్తి

గత శతాబ్ద కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద మహమ్మారి కరోనానే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓ వైపు మహమ్మారితో పోరాడుతున్న సమయంలోనే భారత్‌పై ‘తౌక్టే’, ‘యస్’ వంటి భారీ....

Updated : 30 May 2021 13:17 IST

దిల్లీ: గత శతాబ్ద కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద మహమ్మారి కరోనానే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓ వైపు మహమ్మారితో పోరాడుతున్న సమయంలోనే భారత్‌పై ‘తౌక్టే’, ‘యస్’ వంటి భారీ తుపానులు విరుచుకుపడ్డాయన్నారు. వీటి వల్ల అనేక రాష్ట్రాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు ప్రకృతి విపత్తులను ధైర్యంగా ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. అలాగే గతంతో పోలిస్తే ఆస్తి, ప్రాణ నష్టం భారీగా తగ్గించగలిగామని తెలిపారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా నేపథ్యంలో వైద్యులు, నర్సులతో పాటు ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు చేస్తున్న కృషిని మోదీ మరోసారి ప్రశంసించారు. వారు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సేవలు కొనసాగించారని తెలిపారు. రెండో దశ విజృంభణ సమయంలో ఆసుపత్రులకు తాకిడి పెరగడంతో ఆక్సిజన్‌ డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిందని గుర్తు చేశారు. ఇది పెద్ద సవాల్‌గా నిలిచిందన్నారు. అలాగే ఆక్సిజన్‌ సరఫరాలో అనేక ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌, క్రయోజనిక్‌ ట్యాంకర్ల డ్రైవర్లు, ఎయిర్‌ఫోర్స్‌ పైలట్లు విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది డ్రైవర్ల పేర్లు ప్రస్తావించిన ప్రధాని.. వారి సేవల్ని అభినందించారు.

ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టినట్లు మోదీ తెలిపారు. విదేశాల నుంచి క్రయోజనిక్‌ ట్యాంకర్లు, కాన్సంట్రేటర్లు దిగుమతి చేసుకోవడంతో పాటు దేశీయంగా కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణం జరిగిందన్నారు. ఈ క్రమంలో రోజుకు 900 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని నేడు 9500 మెట్రిక్‌ టన్నులకు పెంచామని తెలిపారు. దాదాపు 10 రెట్లు ఉత్పత్తి పెరిగిందన్నారు.

కరోనా మహమ్మారి మూలంగా దేశంలో ప్రతి రంగం దెబ్బతిందని ప్రధాని తెలిపారు. అయితే, సంక్షోభ సమయంలో వ్యవసాయం రంగం తనని తాను కాపాడుకోవడంతో పాటు ఇంకా పురోగతి సాధించిందని పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో కూడా సాగు దిగుబడులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయన్నారు. కొన్ని పంటలకు ఈసారి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ప్రతిఫలం లభించిందన్నారు. రైతుల కృషి వల్లే ఈరోజు దేశంలో దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందించగలుగుతున్నామన్నారు.

నేటితో భాజపా సర్కార్‌ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం సాధించిన ప్రతి విజయం ఈ దేశం, ఈ దేశ ప్రజలకే చెందుతుందన్నారు. ఈ సమయంలో దేశం గర్వించదగ్గ అనేక విజయాలు అందుకున్నామని తెలిపారు. ఇతర దేశాల ఒత్తిడితో కాకుండా నేడు దేశం తన సొంతం వ్యూహాలతో ముందుకు సాగుతోందన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ లేకుండా ముందుకు సాగడం, మన దేశంపై కుట్రలు చేసే వారికి దీటుగా జవాబు చెప్పడం వంటి ఉదంతాల్ని చూస్తే మనం సరైన దిశగా వెళుతున్నట్లే అర్థమవుతోందన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికీ ఇప్పుడు విద్యుత్తు చేరిందని.. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద గత 21 నెలల్లో నాలుగున్నర కోట్ల ఇళ్లకు తాగునీరు అందించినట్లు వివరించారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద అనేక మంది లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ పథకం ద్వారా చికిత్స అందుకున్న అనేక మంది తమకు కొత్త జీవితం లభించినట్లు భావిస్తున్నారన్నారు. స్వచ్ఛతపైనా ప్రతి ఒక్కరికీ అవగాహన ఏర్పడిందన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని