PM Modi: ఒక్కొక్కరూ 75 స్కూళ్లకు వెళ్లండి.. అథ్లెట్లకు ప్రధాని విజ్ఞప్తి‌!

వచ్చే ఏడాదిలో జరగనున్న పంద్రాగస్టు వేడుకల నాటికి ఒక్కో అథ్లెట్‌ 75 పాఠశాలలను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.......

Published : 16 Aug 2021 22:18 IST

దిల్లీ: వచ్చే ఏడాదిలో జరగనున్న పంద్రాగస్టు వేడుకల నాటికి ఒక్కో అథ్లెట్‌ 75 పాఠశాలలను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. పాఠశాల చిన్నారుల్లో పోషకాహర లోపంపై అవగాహన కల్పించడంతో పాటు వారితో కలిసి క్రీడలు ఆడాలని కోరారు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. తన నివాసంలో క్రీడాకారులకు ఏర్పాటు చేసిన అల్పాహార విందులో దాదాపు రెండున్నర గంటల పాటు వారితో ముచ్చటించారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ఈ సందర్భంగా తమ క్రీడా సామగ్రితో పాటు ప్రధానికి కొన్ని బహుమతులు అందజేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన నీరజ్‌ చోప్రా మోదీకి తన జావెలిన్‌ను కానుకగా ఇవ్వగా.. రజతం సాధించిన పీవీ సింధు తన బ్యాడ్మింటన్‌ రాకెట్‌, హాకీ మహిళలు, పురుషుల జట్లు తమ ఆటోగ్రాఫ్‌లతో కూడిన హాకీ స్టిక్స్‌, సీఏ భవాని తన ఖడ్గాన్ని, లవ్లీనా తన బాక్సింగ్‌ గ్లౌజులను మోదీకి అందజేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. క్రీడల పట్ల తల్లిదండ్రుల దృక్పథం మారుతోందని, చాలామంది తమ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు క్రీడలను ఇష్టపడటం భవిష్యత్‌కు ఓ గొప్ప సంకేతమన్నారు. వచ్చే ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఒక్కో అథ్లెట్‌ 75 స్కూళ్లు సందర్శించాలని,  పాఠశాలలకు వెళ్లిన చిన్నారులకు పోషకాహార లోపంపై అవగాహన కల్పించడంతో పాటు వారితో క్రీడలు ఆడటం ద్వారా మరింత ప్రోత్సహించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని