Vande Bharat Express: వందే భారత్‌ రైళ్లలో క్లీనింగ్‌ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!

వందే భారత్‌ రైళ్లలో క్లీనింగ్‌ ప్రక్రియలో మార్పులు చేశారు. ఈ రైళ్లలో ప్రయాణికులు చెత్తా చెదారాన్ని అక్కడే పడేసి వెళ్లిపోవడంతో ఇకపై విమానాల తరహాలో చెత్తను సేకరించనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి వెల్లడించారు.

Published : 30 Jan 2023 01:19 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) రైళ్లలో కొందరు ప్రయాణికులు తిని పడేసిన చెత్తా చెదారంతో నిండి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnaw) స్పందించారు. ఇకపై ఈ రైళ్ల(Vande Bharat Trains Trains)లో క్లీనింగ్‌ విధానాన్ని మార్చాలని అధికారులను ఆదేశించారు. విమానాల్లో తరహాలో క్లీనింగ్‌ ప్రక్రియ అనుసరించాలని సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా రైల్వే సిబ్బంది సంచితో ప్రయాణికుల సీటు వద్దకే వెళ్లి చెత్తాచెదారం ఉంటే అందులో వేయాలని కోరనున్నారు. ఈ మేరకు అశ్వినీ వైష్ణవ్‌ వందే భారత్‌ రైళ్లలో సిబ్బంది చెత్త సేకరిస్తున్న వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘వందే భారత్‌ రైళ్లలో క్లీనింగ్‌ పద్ధతిని మార్చాం. ఈ రైళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అంటూ పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. వందే భారత్‌ రైళ్లలో ప్రయాణికులకు ఆహారం అందిస్తుండటంతో తినిపడేసిన ఆహార పొట్లాలు, ఇతర చెత్తా చెదారాన్ని అందులోనే వదిలేసి ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగి వెళ్లిపోతున్నారు. దీంతో కొందరు నెటిజన్లు వీటిని ఫొటోలు తీసి దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. ఇటీవల ప్రారంభించిన సికింద్రాబాద్‌- విశాఖ వందే భారత్‌ రైలులో తిని వదిలేసిన ప్లేట్లు, కప్పులు, ఇతర చెత్తాచెదారంతో మురికి కూపంలా కనిపించింది. దీంతో హౌస్‌కీపింగ్‌ సిబ్బంది నిర్ణీత వ్యవధిలో పనిచేసినప్పటికీ విశాఖపట్నం చేరుకునే సరికి  ఈ రైలు ఇలా మురికిగా మారుతోందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక రైలును పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తా చెదారాన్ని డస్ట్‌బిన్‌లలో వేయాలంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్‌ ‘గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత వందే భారత్ రైలు పరిస్థితి ఇలా ఉంది’ అంటూ చేసిన ట్వీట్‌కు స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. విమానాల తరహాలోనే ఈ రైళ్లలోనూ చెత్తను సేకరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడిస్తూ శనివారం పోస్ట్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆ వీడియోను దాదాపు ఏడు లక్షల మంది వీక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని