Tawang Sector: చైనాను తిప్పికొట్టాం..! ‘తవాంగ్‌’ ఘర్షణపై రాజ్‌నాథ్‌ ప్రకటన

భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన చైనా బలగాల ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. తవాంగ్‌ సెక్టార్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై మంగళవారం లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన చేశారు.

Updated : 13 Dec 2022 13:14 IST

దిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌(Tawang Sector)లో వాస్తవాధీన రేఖ(LAC)ను అతిక్రమించి, ప్రస్తుత పరిస్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా యత్నించిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajanth Singh) పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశ భూభాగంలోకి  చొచ్చుకొచ్చేందుకు యత్నించిన చైనా(China) బలగాల దుశ్చర్యను భారత సేనలు దీటుగా తిప్పికొట్టాయని వెల్లడించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో భారత్‌- చైనా బలగాల మధ్య ఈ నెల 9న జరిగిన ఘర్షణపై రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం లోక్‌సభ(Lok Sabha)లో ప్రకటన చేశారు.

‘ఇరుదేశాల సైనికుల మధ్య ఈ నెల 9న ఘర్షణ జరిగింది. చైనా పీఎల్‌ఏ సైనికులు భారత్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించారు. ప్రస్తుత స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు యత్నించారు. అయితే, వారి ప్రయత్నాలను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భారత్‌ భూభాగంలోకి చైనా బలగాల అతిక్రమణను మన సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. చైనా సైనికులను తిరిగి తమ పోస్ట్‌వైపు వెళ్లిపోయేలా చేశారు’ అని రాజ్‌నాథ్‌ ప్రకటించారు.

‘తాజా ఘర్షణల్లో ఇరువైపు సైనికులకూ గాయాలయ్యాయి. అయితే భారత సైన్యంలో ఎవరూ చనిపోలేదు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. సరైన సమయంలో కమాండర్ల జోక్యంతో పీఎల్‌ఏ సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం.. స్థానిక భారత కమాండర్‌ చైనా రక్షణశాఖ అధికారులతో డిసెంబర్‌ 11న ఈ వ్యవహారంపై చర్చించారు. ఈ దుశ్చర్యను భారత్‌ తరఫున ఖండించారు. శాంతిస్థాపనకు చొరవ చూపాలని సూచించారు. భారత బలగాలు దేశ సమగ్రతను కాపాడే విషయంపై కట్టుబడి ఉన్నాయి. ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’ అని మంత్రి స్పష్టం చేశారు.

విపక్షాల ఆందోళన.. ఉయభ సభల వాయిదా

అంతకుముందు తవాంగ్‌ ఘటనపై విపక్షాల ఆందోళనతో కాసేపు పార్లమెంట్‌ ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. తవాంగ్‌ ఘటనపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌధరి, డీఎంకే నేత టీఆర్‌ బాలు, ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. దీనిపై మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పందిస్తూ రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేస్తారని పేర్కొన్నారు. అయితే, దీనిపై చర్చ జరగాలంటూ విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగడంతో స్పీకర్‌ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు. తక్షణమే సరిహద్దు అంశంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళనతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. విరామం అనంతరం ఉభయ సభలూ ప్రారంభమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని