Muneerabad to Mahaboobnagar: 276 నెలలు.. దేశంలో అత్యంత ఆలస్యమైన రైల్వే ప్రాజెక్టు..!

అత్యంత ఆలస్యంగా కొనసాగుతోన్న ప్రాజెక్టులు రోడ్డు రవాణా, హైవే రంగంలోనే అధికంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది.

Updated : 09 Oct 2022 19:50 IST

దిల్లీ: మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచేందుకు పలు రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు నత్తనడకన కొనసాగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యంత ఆలస్యంగా కొనసాగుతోన్న ప్రాజెక్టులు రోడ్డు రవాణా, హైవే రంగంలోనే అధికంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది. రోడ్డు రవాణా రంగంలో వాస్తవ షెడ్యూల్‌ ప్రకారం మొత్తం 831 ప్రాజెక్టులు పర్యవేక్షణలో ఉండగా.. వాటిలో 248 ప్రాజెక్టులు ఆలస్యంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది.

రైల్వేలోనూ పలు ప్రాజెక్టులు (Rail Projects) అత్యంత ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఇందులో 173 ప్రాజెక్టులకు గాను 116 ప్రాజెక్టుల్లో పనులు నత్తనడకన సాగుతున్నట్లు తాజా నివేదిక వెల్లడిచింది. పెట్రోలియం రంగంలో 139 ప్రాజెక్టులకు 88 ఆలస్యంగా కొనసాగుతున్నట్లు తెలిపింది.

*  దేశంలో అత్యంత ఆలస్యంగా కొనసాగుతోన్న రైల్వే ప్రాజెక్టుగా మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ (Muneerabad-Mahaboobnagar) మార్గం తొలిస్థానంలో నిలిచింది. ఈ ప్రాజెక్టు 276 నెలల ఆలస్యంగా కొనసాగడం గమనార్హం.

బెలాపుర్‌-సీవుడ్‌-అర్బన్‌ ఎలక్ట్రీఫైడ్‌ డబుల్‌ లైన్‌ రెండో స్థానంలో నిలవగా.. గత 228 నెలలుగా ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి.

అత్యంత ఆలస్యంగా సాగుతోన్న ప్రాజెక్టుల జాబితాలో కోటిపల్లి-నర్సాపూర్‌ రైల్‌ ప్రాజెక్టు మూడో స్థానంలో ఉంది. 216 నెలలుగా ఈ ప్రాజెక్టు పెండింగులో ఉంది.

రైల్వేల్లో 173 ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.3,72,761 కోట్లు కాగా ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు రూ.6,19,569 కోట్లు కానున్నట్లు అంచనా.

రోడ్డు రవాణా, హైవేల (Road Transport) విషయానికొస్తే.. మొత్తంగా 831 ప్రాజెక్టులు, వాటి అనుమతులు వచ్చినప్పుడు అంచనా వ్యయం రూ.4,92,741కోట్లుగా ఉంది.

కానీ, ఆలస్యం కారణంగా ఇవి పూర్తయ్యేందుకు అయ్యే వ్యయం రూ.5,40,815 కోట్లకు పెరిగినట్లు అంచనా. దాదాపు 9.8శాతం పెరుగుదల కనిపించింది. అయితే, ఆగస్టు 2022 నాటికి వీటికి రూ.3,21,001 కోట్లను ఖర్చు చేశారు. అంచనా మొత్తంలో ఇది 59.4శాతం.

ఇక పెట్రోలియం రంగంలో 139 ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.3,66,013కోట్లు కాగా.. ఇవి పూర్తయ్యేనాటికి రూ.3,86,263 కోట్లు కానున్నట్లు లెక్కకట్టారు. అంచనా వ్యయంలో ఇప్పటివరకు రూ.1,36,450 ఖర్చు చేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

ఇదిలాఉంటే, రూ.150కోట్ల వ్యయానికి పైగా ఖర్చయ్యే ప్రాజెక్టులను కేంద్ర గణాంకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టు మానీటరింగ్‌ విభాగం (IPMD) పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులను అమలు చేస్తోన్న ఏజెన్సీలు ఆన్‌లైన్‌ కంప్యూటరైజ్డ్‌ మానీటరింగ్‌ సిస్టమ్‌ (OCMS)లో పొందుపరిచే సమాచారాన్ని బట్టి వీటి పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే అత్యంత ఆలస్యంగా కొనసాగుతోన్న ప్రాజెక్టులకు సంబంధించి తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని