Varsha Raut: భూ కుంభకోణం కేసు.. సంజయ్‌ రౌత్‌ భార్యకు ఈడీ నోటీసులు

పాత్రా చాల్‌ భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఇటీవల శివసేన(Shivsena) ఎంపీ సంజయ్‌ రౌత్‌(Sanjay Raut)ను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED).. ప్రస్తుతం...

Published : 05 Aug 2022 01:42 IST

ముంబయి: పాత్రా చాల్‌ భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఇటీవల శివసేన(Shivsena) ఎంపీ సంజయ్‌ రౌత్‌(Sanjay Raut)ను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED).. ప్రస్తుతం ఆయన్ను విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన భార్య వర్షా రౌత్‌(Varsha Raut)కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆమె పేరును పలుమార్లు ప్రస్తావించిన ఈడీ.. నాలుగు నెలల క్రితం ఆమెకు సంబంధించిన కొన్ని ఆస్తులనూ అటాచ్‌ చేసింది. కానీ.. ఇప్పటివరకు ప్రశ్నించలేదు. అయితే, విచారణకు ఎప్పుడు హాజరు కావాలనేదానిపై వివరాలు తెలియరాలేదు.

సంజయ్‌ రౌత్‌ ఈడీ కస్టడీ పొడగింపు..

ఇదిలా ఉండగా.. సంజయ్‌ రౌత్‌ ఈడీ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగిస్తూ ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ఆగస్టు 4 వరకు ఆయనను కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. నేటితో గడువు ముగియనుండటంతో.. ఈడీ ఆయన్ను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చింది. ఈ కేసులో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నందున.. వాటిపై విచారించాల్సి ఉందని, ఆగస్టు 10 వరకు కస్టడీ పొడగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కోర్టు.. ఆగస్టు 8 వరకు అనుమతించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్ది గంటల్లోనే రౌత్‌ భార్యకు సమన్లు జారీ కావడం గమనార్హం.

‘వెంటిలేషన్‌ లేని గదిలో ఉంచారు..’

కస్టడీ సమయంలో ఈడీ అధికారులు తనను కిటికీలు, వెంటిలేషన్‌ లేని గదిలో ఉంచారని సంజయ్‌ రౌత్ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈడీపై ఏదైనా ఫిర్యాదు ఉందా అని విచారణ సందర్భంగా కోర్టు అడిగినప్పుడు.. ఆయన ఈ మేరకు స్పందించారు. ‘ప్రత్యేకంగా ఏం లేదు. కానీ.. తనను ఉంచిన గదికి కిటికీ, వెంటిలేషన్ లేదు’ అని చెప్పారు. దీంతో కోర్టు.. ఈడీ వివరణ కోరింది. రౌత్‌ను ఏసీ గదిలో ఉంచారని, అందుకే కిటికీ లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హితేన్ చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏసీ వినియోగించుకోలేనని రౌత్‌ తెలిపారు. దీంతో ఆయన్ను సరైన వెంటిలేషన్ ఉన్న గదిలో ఉంచుతామని ఈడీ.. కోర్టుకు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని