Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్రలో సోనియా, ప్రియాంక

కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారత్‌ జోడో పాద యాత్ర (Bharat Jodo Yatra) నిరాటంకంగా కొనసాగుతోంది. తమిళనాడులో మొదలైన ఈ పాదయాత్ర త్వరలో కర్ణాటకలో ప్రారంభం కానుంది.

Published : 23 Sep 2022 20:23 IST

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారత్‌ జోడో పాద యాత్ర (Bharat Jodo Yatra) నిరాటంకంగా కొనసాగుతోంది. తమిళనాడులో మొదలైన ఈ పాదయాత్ర త్వరలో కర్ణాటకలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. రాహుల్‌ గాంధీ సహా పలువురు భారత యాత్రికులు చేపట్టిన ఈ పాదయాత్రకు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యాత్రలో పాల్గొననున్నారు. కర్ణాటక జరిగే ఈ యాత్రలో నేతలిద్దరూ పాల్గొంటారని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వెల్లడించారు.

భారత్‌ జోడో యాత్ర సెప్టెంబర్‌ 30న కర్ణాటకలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, మరో కార్యదర్శి కర్ణాటక వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రణ్‌దీప్‌ సూర్జేవాలా, డీకే శివకుమార్‌ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వారు పాల్గొనే తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని డీకే వెల్లడించారు. సెప్టెంబర్‌ 30న కర్ణాటకలోకి యాత్ర ప్రవేశిస్తుందని, దసరా సందర్భంగా రెండ్రోజులు యాత్రకు సెలవు ఉంటుందని పేర్కొన్నారు. యాత్రలో సోనియా గాంధీ ఓ రోజు, ప్రియాంక గాంధీ మరో రోజు పాల్గొంటారని కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. తమిళనాడు, కేరళలో యాత్ర విజయవంతమైందని, కర్ణాటకలోనూ అదే స్థాయిలో విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. యాత్రకు కేపీసీసీ చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని