మళ్లీ షట్‌డౌన్‌ దిశగా దక్షిణ కొరియా!

కరోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా మళ్లీ ఆంక్షలు అమలు చేసేందుకు దక్షిణ కొరియా సిద్ధమవుతోంది! రెండోదశలో పెరుగుతున్న కేసులను అదుపు చేయాలంటే షట్‌డౌన్‌ చేయక తప్పదని యోచిస్తోంది. వరుసగా తొమ్మిది రోజుల నుంచి అక్కడ మూడంకెల్లో కొవిడ్‌-19 కేసులు...

Published : 22 Aug 2020 12:26 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా మళ్లీ ఆంక్షలు అమలు చేసేందుకు దక్షిణ కొరియా సిద్ధమవుతోంది! రెండోదశలో పెరుగుతున్న కేసులను అదుపు చేయాలంటే షట్‌డౌన్‌ చేయక తప్పదని యోచిస్తోంది. వరుసగా తొమ్మిది రోజుల నుంచి అక్కడ మూడంకెల్లో కొవిడ్‌-19 కేసులు నమోదవుతున్నాయి.

వరుసగా రెండో రోజు దక్షిణ కొరియాలో 300+ కేసులు వచ్చాయి. శనివారం ఏకంగా 332 నమోదవ్వడంతో ప్రభుత్వంలో కలవరపాటు మొదలైంది. ప్రస్తుతం గ్రేటర్‌ సియోల్‌ వరకు మాత్రమే ఉన్న ఆంక్షలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆ దేశ ప్రధాని చంగ్‌ సె గ్యూన్‌‌ మీడియాతో చెప్పారు.

సియోల్‌ నగరంలో ఇప్పటికే చర్చిలు మూసేశారు. భౌతికదూరం నిబంధనలను కఠినతరం చేశారు. నైట్‌క్లబ్బులు, బార్లు, బఫెట్‌ రెస్టారెంట్లు, కంప్యూటర్‌ గేమింగ్‌ కేఫ్‌లు మూసేశారు. బేస్‌బాల్‌, సాకర్‌ మ్యాచులు జరిగే స్టేడియాల్లో అభిమానులను అనుమతించడం లేదు.

దక్షిణ కొరియాలో మొత్తం కరోనా వైరస్‌ కేసులు సంఖ్య 17,002గా ఉంది. 309 మంది మరణించగా 14,169 మంది కోలుకున్నారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి వరకు అక్కడ మూడంకెల్లో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఏప్రిల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మేలో కొన్ని రోజులు కేసులేమీ నమోదు కాలేదు. దాంతో చాలాచోట్ల ఆంక్షలను రద్దు చేశారు. స్టేడియాల్లోకి ప్రేక్షకులను సైతం అనుమతించారు. అయితే ఆగస్టు 13 నుంచి అక్కడ రోజుకు 100కు పైగా కొవిడ్‌-19 కేసులు వస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే 600+ కేసులు రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని