Sukesh Chandrashekhar: నన్నూ నా భార్యను హింసించి చంపేస్తారు..!

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుకేశ్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిల్లీలోని తిహాడ్‌ జైల్లో ఉన్న అతడు ఆప్‌ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశాడు.

Updated : 10 Nov 2022 11:58 IST

దిల్లీ: తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాకు మరోమారు లేఖ రాశాడు. తమని చిత్రహింసలకు గురిచేసి చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆప్‌ నేతలపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలంటూ జైల్లో వేధిస్తున్నారని, దిల్లీ వెలుపల ఉన్న వేరే జైలుకు తమను తరలించాలని కోరాడు. 

‘ఆప్‌ నేతలకు వ్యతిరేకంగా నా వద్ద ముఖ్యమైన ఆధారాలున్నాయి. ఆ విషయం వారికి బాగా తెలుసు. అందుకే నన్ను, వేరే జైలులో ఉన్న నా భార్యను వేధించడానికి వారు ఎంతకైనా తెగిస్తారు. రాజీ కుదుర్చుకోవడానికి ఆప్‌ నేత సత్యేందర్‌జైన్‌ నాకు పలు ఆఫర్లు ఇస్తున్నారు. వాటిని అంగీకరించకపోతే.. నా భార్యను చిత్రహింసలకు గురిచేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు’ అంటూ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖలో ఆరోపించాడు. ఇది అతడు రాసిన ఐదో లేఖ. 

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుకేశ్ అరెస్టయిన విషయం తెలిసిందే. దిల్లీలోని తిహాడ్‌ జైల్లో ఉన్న అతడు ఆప్‌ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశాడు. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్‌ బలవంతంగా రూ.10కోట్లు వసూలు చేశారని ఆరోపించాడు. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి జైన్‌ తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. ఇంకా ఎవరెవరికి ఎంతెంత ఇచ్చిందీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు రాసిన లేఖలో వెల్లడించాడు. అప్పటి నుంచి ఆప్‌ కార్యకర్తల నుంచి తనకు ముప్పు పొంచి ఉందంటూ పలు లేఖలు రాశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని