West Bengal: సువేందు తండ్రికి ‘వై-ప్లస్’ భద్రత

పశ్చిమ బంగాల్‌కు చెందిన ఎంపీలు శిశిర్‌ అధికారి, దివ్యేందు అధికారికి ‘వై-ప్లస్‌’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా........

Published : 22 May 2021 22:29 IST

కోల్‌కతా: పశ్చిమ బంగాల్‌కు చెందిన ఎంపీలు శిశిర్‌ అధికారి, దివ్యేందు అధికారికి ‘వై-ప్లస్‌’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విజయం సాధించిన సువేందు అధికారి తండ్రే శిశిర్‌ అధికారి. ఇక శిశిర్‌కు దివ్యేందు అధికారి స్వయానా సోదరుడు. వీరివురికి భద్రతను పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.

గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన అధికారి కుటుంబం ఎన్నికలకు ముందు భాజపా గూటికి చేరింది. తొలుత సువేందు పార్టీ మారి మమతకు షాక్‌ ఇవ్వగా.. ఎన్నికలకు కొన్ని రోజుల మందు శిశిర్‌, దివ్యేందు సైతం భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, భాజపా మధ్య తీవ్ర పోటీ ఉంటుందని భావించినప్పటికీ.. ఫలితాలు తృణమూల్‌కే అనుకూలంగా వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే భాజపా మెరుగైనప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.

అంతకుముందు కొత్తగా ఎన్నికైన 77 మంది భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింస నేపథ్యంలో కేంద్ర బలగాలు, ఇతర సీనియర్‌ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. 61 మందికి ‘ఎక్స్‌’ కేటగిరీ, మిగతా వారికి  ‘వై’ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి ‘జడ్‌’ కేటగిరీ భద్రత కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని