Omicron : 200 మంది కొవిడ్ బాధితుల్లో ఒక్కరికేఆక్సిజన్ అవసరం..!

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ 20కి పైగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. ఈ కొత్త వేరియంట్ కేసులు రెండు వేలకు సమీపించాయి. దీని ప్రభావంతో రెండోరోజు 30 వేలకు పైగా కొత్త కేసులొచ్చాయి.

Updated : 04 Jan 2022 12:53 IST

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త వేరియంట్ కేసులు రెండు వేలకు సమీపించాయి. దీని ప్రభావంతో రెండోరోజూ 30 వేలకు పైగా కొత్త కొవిడ్‌ కేసులొచ్చాయి. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నా.. కొవిడ్ బాధితుల్లో ఎక్కువశాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదని అధ్యయనాలు వెల్లడిస్తుండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా అసోషియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా(ఏహెచ్‌పీఐ)కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ప్రతి 200 మంది బాధితుల్లో ఒక్కరికి మాత్రమే ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వస్తోందని పేర్కొంది. ఈ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2,500 సూపర్ స్పెషాలిటీ, 8వేల చిన్నస్థాయి ఆసుపత్రుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పలు విషయాలు వెల్లడించింది.

‘కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిన బాధితుల్లో 0.5 శాతం కంటే తక్కువమందికే ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. అంటే ప్రతి 200 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ అవసరం ఉంటోంది. కరోనా రెండో వేవ్‌ సమయంలో కంటే భిన్నమైన పరిస్థితి ఇది. కొవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినా.. సగటున మూడు రోజులు మాత్రమే ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కేసుల్లో మహారాష్ట్ర, దిల్లీ వాటానే ఎక్కువగా ఉంటోంది. అయినా సరే, అక్కడి ఆసుపత్రుల్లో పడకల లభ్యత 90 శాతం కంటే ఎక్కువగా ఉంది’ అని ఏహెచ్‌పీఐ వెల్లడించింది. ‘మహారాష్ట్రలో దాదాపు 9 నుంచి 10 శాతం పడకలు మాత్రమే నిండుతుండగా, దిల్లీలో 10 శాతం లోపే ఉంది’ అని అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జె.జ్ఞాని తెలిపారు.

రెండో దశలో దేశంలో మహమ్మారి భారీగా విజృంభించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ కోరత, ఆస్పత్రుల్లో పడకలు లభించక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వైద్య వ్యవస్థ గతంలో ఎన్నడూ చూడని ఒత్తిడిని ఎదుర్కొంది. ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాజా పరిస్థితిపై ఏహెచ్‌పీఐ వివరాలు సేకరిస్తోంది. కొన్ని మెజారిటీ ఆస్పత్రులు సొంత ఆక్సిజన్ జనరేషన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపింది. ‘ఇప్పటివరకు ఆక్సిజన్ అందించాల్సిన అవసరం 0.5 శాతం మాత్రమే. ఇది 5 శాతానికి మించినప్పుడు, పడకల ఆక్యుపెన్సీ 30 శాతం దాటినప్పుడు మేం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తాం’ అని పేర్కొంది.

ఇతర రకాల కంటే ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువే..

కరోనాలో ఇతర రకాలతో పోలిస్తే కొత్తదైన ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువేనని, ఆసుపత్రిలో చేరాల్సి వస్తున్నవారి సంఖ్యా స్వల్పమేనని దక్షిణాఫ్రికాలో ఒక అధ్యయనం వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిని నిపుణులు ఇంకా సమీక్షించాల్సి ఉంది. ఒమిక్రాన్‌ కేసులు ఎక్కువగా వచ్చిన తొలి నాలుగు వారాల్లో ఆసుపత్రుల్లో చేరిన రోగుల వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. గౌటెంగ్‌ ప్రావిన్సులో బీటా, డెల్టా రకాలు మొదటి నాలుగు వారాల్లో చూపిన తీవ్రతను, ఒమిక్రాన్‌ ఉద్ధృతిని వీరు పోల్చిచూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని