Covid Vaccine: కరోనాపై టీకాలు: కొత్త వేరియంట్లనూ ఎదుర్కొనే రోగ నిరోధక కణాలు 

కొవిడ్‌-19 మహమ్మారి పుణ్యమా అని సామాన్యులు కూడా వైరస్‌లు, టీకాలు,

Published : 06 Sep 2021 10:31 IST

వ్యాక్సిన్లపై సంశయం వద్దు: శాస్త్రవేత్తలు 

కేప్‌ టౌన్‌: కొవిడ్‌-19 మహమ్మారి పుణ్యమా అని సామాన్యులు కూడా వైరస్‌లు, టీకాలు, రోగ నిరోధక వ్యవస్థ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అయితే వ్యాక్సిన్లకు సంబంధించి చాలా ముఖ్యమైన, సానుకూల అంశం పెద్దగా జనబాహుళ్యంలోకి వెళ్లలేదని దక్షిణాఫ్రికాలోని వెస్ట్రన్‌ కేప్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డెవాల్డ్‌ ష్కోమన్, బుర్ట్‌రామ్‌ సి ఫీల్డింగ్‌ తెలిపారు. టీకా సమర్థత గురించి పరిశీలించేటప్పుడు రోగ నిరోధక వ్యవస్థలోని ఒక పార్శ్యాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారని చెప్పారు. ముఖ్యమైన టి-కణాలను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లో కొత్తగా వస్తున్న వేరియంట్ల నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తున్నాయని భరోసా ఇచ్చారు. పైగా ఆ రక్షణ దీర్ఘకాలం కొనసాగుతుందని వివరించారు. ప్రస్తుత కొవిడ్‌ వ్యాక్సిన్లు టి-కణాలను ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిలో ‘టీకా సంశయాన్ని’ దూరం చేయాలని కోరుతున్నారు. వీరు వెల్లడించిన అంశాలివీ.. 

బ్యాక్టీరియా, వైరస్, శిలీంద్రాలు, పరాన్నజీవుల వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రోగనిరోధక వ్యవస్థ మనల్ని కాపాడుతుంది. ఇది రెండురకాలుగా ఉంటుంది. ఒకటి.. యాంటీబాడీలకు సంబంధించినది కాగా.. రెండోది టి కణాలతో ముడిపడినది. యాంటీబాడీలు వైరస్‌లకు అతుక్కొని, వాటిని బంధించేస్తాయి. తద్వారా అవి కణాలకు ఇన్‌ఫెక్షన్‌ కలగకుండా చూస్తాయి. టి కణాలు మాత్రం అప్పటికే వైరస్‌ బారినపడిన కణాలను చంపేస్తాయి. అంతేకాదు.. భవిష్యత్‌లో అదే వ్యాధికారక జీవి మన శరీరంలోకి ప్రవేశిస్తే గుర్తించి, రీఇన్‌ఫెక్షన్‌ కలగకుండా రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేస్తాయి. 

11 ఏళ్ల రక్షణ 

మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే కరోనా వైరస్‌లను అడ్డుకోవడంలో టి కణాలు చాలా శక్తిమంతమైన ఆయుధాలని ఇప్పటికే జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. 2003లో వణికించిన సార్స్‌ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా వెలువడిన టి-కణ రక్షణ ఏకంగా 11 ఏళ్ల పాటు సమర్థంగా కొనసాగినట్లు 2016లో 
జరిగిన అధ్యయనం తేల్చింది. 

కొత్త వేరియంట్లపైనా.. 

చాలావరకూ టీకాల్లో సూక్ష్మజీవికి సంబంధించిన ఒక చిన్న భాగం ఉంటుంది. ఇది సహజసిద్ధ ఇన్‌ఫెక్షన్‌ను అనుకరిస్తూ రోగ నిరోధక శక్తిని సన్నద్ధం చేస్తుంది. ప్రస్తుత కొవిడ్‌ టీకాల్లో కరోనా వైరస్‌కు సంబంధించిన స్పైక్‌ ప్రొటీన్‌ భాగాలు ఉన్నాయి. స్పైక్‌ ప్రొటీన్‌లో వచ్చిన ఉత్పరివర్తనల వల్ల వ్యాధిని వ్యాప్తి చేయడం, రోగనిరోధక స్పందనను ఏమార్చడం వైరస్‌కు చాలా సులువైంది. అయితే టి కణాలు.. మొదటి వేరియంట్‌పై పనిచేసిన తరహాలోనే కొత్త రకాలనూ నిర్వీర్యం చేయగలవు. యాంటీబాడీలు తగ్గిపోయినా.. ఇవి దీర్ఘకాలం పాటు పనిచేస్తాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని