Bipin Rawat: బిపిన్ రావత్​ చివరి సందేశం విడుదల.. ఏం మాట్లాడారంటే..?

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం ఆదివారం విడుదల చేసింది. 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా......

Published : 13 Dec 2021 01:08 IST

దిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం ఆదివారం విడుదల చేసింది. 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా.. దిల్లీలో నిర్వహించిన ‘స్వర్ణిమ్​ విజయ్‌ పర్వ్​’ కార్యక్రమంలో జనరల్​ రావత్​ చివరి వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు. డిసెంబరు 7న రికార్డు చేసిన ఈ వీడియో ద్వారా.. స్వర్ణిమ్‌ విజయ్‌ పర్వ్‌ సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ యుద్ధంలో అమరులైన సైనికులకు రావత్ నివాళులు అర్పించారు. 1971 ఇండియా-పాక్‌ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద ఈ పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అందులో తెలిపారు. భారత పౌరులు ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని తొలుత ఘనంగా నిర్వహించాలని భావించినా.. దేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్​ రావత్​ అకాల మరణంతో నిరాడంబరంగా జరుపుతున్నట్లు రాజ్​నాథ్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రావత్​ను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ‘ఈ వేడుక దక్షిణాసియా చరిత్ర, భౌగోళిక స్థితిని మార్చిన భారత సైన్యం అద్భుతమైన విజయానికి గుర్తు. ఆ యుద్ధంలో అమరులైన ప్రతి సైనికుడి ధైర్యానికి, పరాక్రమానికి, త్యాగానికి నమస్కరిస్తున్నాను. ఆ ధైర్యవంతులందరి త్యాగానికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఈ యుద్ధం మన నైతికతకు, మన ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, న్యాయంగా వ్యవహరించడానికి గొప్ప ఉదాహరణ’ అని రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు.

1971లో తూర్పు పాకిస్థాన్‌లో స్వతంత్ర పోరు మొదలై.. భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారితీసింది. ఇందులో పాక్‌ను భారత్‌ ఓడించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న విజయ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు. ఆ​ యుద్ధంలో భారత్‌ విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్వర్ణ విజయ సంవత్సరం’గా పేర్కొంటూ ఏడాదిపాటు దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని