Swiss Bank: భారత్‌కు చేరిన ‘స్విస్‌ ఖాతా’ల మూడో జాబితా

స్విస్‌ బ్యాంకుల్లో మన దేశ పౌరుల ఖాతాలకు సంబంధించిన మూడో జాబితా భారత్‌కు చేరింది. స్విట్జర్లాండ్‌తో చేసుకున్న సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా భారతీయుల ఖాతాల వివరాలను స్విస్‌ బ్యాంకులు అందించింది.

Published : 11 Oct 2021 22:14 IST

బెర్న్‌: స్విస్‌ బ్యాంకుల్లో మన దేశ పౌరుల ఖాతాలకు సంబంధించిన మూడో జాబితా భారత్‌కు చేరింది. స్విట్జర్లాండ్‌తో చేసుకున్న సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా భారతీయుల ఖాతాల వివరాలను స్విస్‌ బ్యాంకులు అందించింది. భారత్‌తోపాటు దాదాపు 96దేశాలకు చెందిన మొత్తం 33లక్షల ఖాతాల వివరాలను ఆయా దేశాలకు అందించినట్లు అక్కడి ఫెడరల్‌ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FTA) వెల్లడించింది.

సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా ఈసారి మరో పది దేశాలకు చెందిన ఖాతాల వివరాలను ఆయా దేశాలకు అందించినట్లు ఎఫ్‌టీఏ పేర్కొంది. ఆంటిగ్వా,  అజర్‌బైజాన్‌, డొమినికా, ఘనా, లెబనాన్‌, మకావు, పాకిస్థాన్‌, ఖతర్‌, సమోవా, వనౌతు దేశాలు ఉన్నట్లు తెలిపింది. అయితే, 96దేశాల ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆయా దేశాల మొత్తం పేర్లను మాత్రం వెల్లడించలేదు. కేవలం ఆ జాబితాలో భారత్‌ ఉన్న విషయాన్ని మాత్రమే ఎఫ్‌టీఏ వెల్లడించింది. భారత్‌కు చెందిన పౌరుల, సంస్థల పేరుతో స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న ఖాతాల వివరాలను గత నెలలోనే భారత అధికారులతో పంచుకున్నట్లు ఎఫ్‌టీఏ పేర్కొంది.

ఆటోమేటిక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (AEOI)లో భాగంగా స్విట్జర్లాండ్‌ నుంచి 2019లో భారత్‌కు తొలి జాబితా అందింది. అనంతరం 2020 సెప్టెంబర్‌లో భారత్‌ రెండో జాబితా అందగా.. తాజాగా మూడో జాబితా అందింది. ఈసారి మాత్రం తొలిసారిగా భారతీయుల స్థిరాస్తుల వివరాలతో కూడిన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్‌లో అపార్టుమెంట్లు, ఫ్లాట్ల వివరాలతో పాటు ఆయా స్థిరాస్తుల ద్వారా వారు సంపాదిస్తున్న ఆదాయ వివరాలు కూడా అందులో ఉండనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని