Sharad Pawar: ప్రతిపక్షాలే లక్ష్యంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం! 

ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకునే సీబీఐ, ఈడీ, నార్కొటిక్స్‌ బ్యూరో వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

Published : 13 Oct 2021 21:51 IST

కేంద్ర ప్రభుత్వంపై ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ మండిపాటు

ముంబయి: ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకునే సీబీఐ, ఈడీ, నార్కొటిక్స్‌ బ్యూరో వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో విఫలం కావడంతోనే కేంద్రం ఇటువంటి ప్రయత్నాలకు దిగుతోందని శరద్‌ పవార్‌ విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌తోపాటు తమ కూటమి నేతలపై వరుసగా జరుగుతోన్న కేంద్ర సంస్థల దాడులను ఆయన ప్రస్తావించారు.

ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై గతకొన్ని రోజులుగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. మరోవైపు ఎన్‌సీపీకే చెందిన అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఇంటిపై ఇప్పటికే ఐదుసార్లు సీబీఐ సోదాలు చేసింది. వీటితోపాటు ఎన్‌సీబీ కూడా మరికొంతమంది ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరుపుతోంది. ఇలా కేవలం ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నించిన భాజపా.. అందులో విఫలం కావడంతోనే అధికార కూటమీ (మహా వికాస్‌ అఘాడీ)కి చెందిన నేతలపై దాడులకు ఉపక్రమించిందని విమర్శించారు.

మరోవైపు డ్రగ్స్‌ కేసులో కేంద్ర సంస్థ కంటే రాష్ట్రస్థాయి నార్కొటిక్‌ విభాగమే ఉత్తమంగా పనిచేస్తోందని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ఇక భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌పై విరుచుకుపడిన పవార్‌.. అధికారంలో లేకున్నా ఇంకా ఆయనే ముఖ్యమంత్రిగా భావించుకుంటున్నారని అన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించినప్పటికీ తనకు మాత్రం అటువంటి లక్షణాలు రాలేదని శరద్‌ పవార్‌ వెల్లడించారు. మరోవైపు ఇతర సరిహద్దు దేశాల మాదిరిగానే కశ్మీర్‌ వ్యవహారంలోనూ చైనా ప్రమేయం పెరుగుతోందని ఎన్‌సీపీ చీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని