
Indian Railways: కరోనా కాటుకు 2903 మంది ఉద్యోగులు బలి!
మొత్తం కేసుల్లో 11శాతం మంది 20ఏళ్లలోపు వారే - కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయానికి వేల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొవిడ్-19 ప్రభావానికి 2,903 మంది రైల్వే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు వెల్లడించారు. అయితే, ఆ ఉద్యోగులకు చెందాల్సిన బకాయిలను ఇప్పటికే 2,780 మంది బాధిత కుటుంబ సభ్యులకు అందజేశామని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రైల్వే ఉద్యోగులపైన ఆధారపడే కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టే విధానం రైల్వేలో ఉందని.. ఇందులో భాగంగా ఇప్పటికే 1732 కేసుల్లో వీటిని అందించామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
రైల్వే శాఖలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా శరవేగంగా కొనసాగుతోందని రైల్వేశాఖ వెల్లడించింది. 8,63,868 మంది రైల్వే ఉద్యోగులకు తొలిడోసు పంపిణీ చేయగా.. 2,34,184 మందికి రెండు డోసులు ఇచ్చామని పేర్కొంది.
11శాతం మంది 20 ఏళ్లలోపువారే..
దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 11శాతం 20ఏళ్లలోపు వారిలోనేని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వెల్లడించారు. దేశంలో 18ఏళ్లలోపు పిల్లల్లో ఎంతమందికి వైరస్ సోకిందని లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. ఇక పిల్లల వ్యాక్సిన్‌లకు సంబంధించి ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2-18ఏళ్ల పిల్లలపై ప్రయోగాలు జరిపేందుకు భారత్ బయోటెక్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ-CDSCO అనుమతి ఇవ్వగా.. 12ఏళ్ల వయసుపైబడిన వారి కోసం జైడస్ క్యాడిలా సంస్థలకు అనుమతి ఇచ్చినట్లు మరో సమాధానంగా చెప్పారు. వీటి ప్రయోగ ఫలితాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.