IAF Aircraft crash: భారత వాయుసేన.. రెండేళ్లలోనే ఎన్ని ప్రమాదాలంటే!

ఈమధ్యే మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన మిరాగ్‌ 2000తోపాటు గడిచిన రెండేళ్లలో మొత్తం ఏడు సైనిక విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు ఈమధ్యే కేంద్ర రక్షణశాఖ వెల్లడించింది.

Updated : 08 Dec 2021 22:09 IST

ఈ మధ్యే వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఇటువంటి ఘటనలు భారత వాయుసేనలో గత కొంతకాలంగా పెరగడం కలవరపెడుతోంది. ఈ మధ్యే మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన మిరాగ్‌ 2000తో పాటు గడిచిన రెండేళ్లలో మొత్తం ఏడు సైనిక విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు ఈ మధ్యే కేంద్ర రక్షణశాఖ వెల్లడించింది. అయితే, ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించేందుకు ఇప్పటికే కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిపింది.

భారత వాయుసేనలో చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలపై కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ ఈమధ్యే లోక్‌సభలో ఓ ప్రకటన చేశారు. గడిచిన రెండేళ్లలోనే ఏడు సైనిక విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయన్న ఆయన.. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు 2014-19 కాలంలోనూ దాదాపు 10 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని అప్పటి రక్షణశాఖ సహాయమంత్రి శ్రీపాద నాయక్‌ వెల్లడించారు. ఆయా ఘటనల్లో మొత్తం 46 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.

ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న సైనిక విమాన ప్రమాదాలు..

* ఈ ఏడాది అక్టోబర్‌ 21న మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో భారత వాయుసేనకు చెందిన మిరాగ్‌ 2000 కుప్పకూలింది.

* ఐఏఎఫ్‌కు చెందిన MiG-21 విమానం ఆగస్టు నెలలో రాజస్థాన్‌లో ప్రమాదానికి గురయ్యింది.

* ఈ ఏడాది మేలో పంజాబ్‌లో జరిగిన వైమానిక శిక్షణా విమానం కూలిన ఘటనలో పైలట్‌ మృతిచెందారు.

* ఇదే సంవత్సరం మార్చి నెలలో మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న MiG-21 ప్రమాదంలో గ్రూప్‌ కెప్టెన్‌ ఆశీష్‌ గుప్తా ప్రాణాలు కోల్పోయారు.

* తాజాగా తమిళనాడులో జరిగిన ప్రమాదంలో ఏకంగా 13 మంది సైనిక ఉన్నతాధికారులు దుర్మరణం చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని