Kisan Mahapanchayat: కేంద్రం దిగొచ్చే వరకూ ఉద్యమిస్తాం..!

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని రైతు సంఘాలు మరోసారి పునురుద్ఘాటించాయి.

Updated : 05 Sep 2021 20:01 IST

కిసాన్‌ మహాపంచాయత్‌లో రైతు సంఘాలు

లఖ్‌నవూ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని రైతు సంఘాలు మరోసారి పునరుద్ఘాటించాయి. ఈ నేపథ్యంలో కొద్ది మంది రైతులు మాత్రమే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కేంద్రం చేస్తోన్న వాదనను తోసిపుచ్చిన రైతు సంఘాలు.. పార్లమెంటులో కూర్చున్న వారికి వినిపించేలా తమ గళాన్ని వినిపిస్తామని నొక్కి చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం నిర్వహించిన కిసాన్‌ మహాపంచాయత్‌కి భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

‘కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కొద్దిమంది రైతులు మాత్రమే నిరసన చేపడుతున్నారని కేంద్రం చెబుతోంది. ఎంత తక్కువ మంది నిరసన తెలుపుతున్నామో ఇప్పుడు చూడండి. పార్లమెంటులో కూర్చున్న వారికి తమ గళాలు వినిపించేలా ఉద్యమిస్తాం’ అని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మహాపంచాయత్‌లో రైతు సంఘాల నాయకులు పునరుద్ఘాటించారు. కులమతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలతో పాటు అన్ని రాష్ట్రాల రైతులు తమ ఉద్యమానికి మద్దతిస్తున్నారనే విషయం ఈ మహాపంచాయత్‌ ద్వారా స్పష్టమవుతోందని సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా వెల్లడించింది. రైతులు చేస్తోన్న పోరాట శక్తి ఎంటో ఈ మహాపంచాయత్‌ వల్ల యోగి-మోదీ ప్రభుత్వాలకు తెలిసివస్తుందని అభిప్రాయపడింది.

ఇక సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతు సంఘాలు.. నిరసన కార్యక్రమాలను మరోసారి ఉధృతం చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కిసాన్‌ మహాపంచాయత్‌ నిర్వహించారు. ఇందుకు పంజాబ్‌, హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు, సమీప ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. గడిచిన 9నెలలుగా చేపడుతోన్న రైతుల నిరసన కార్యక్రమాల్లో ఇదే అతిపెద్దదని రైతు సంఘాలు పేర్కొన్నాయి. సభకు దాదాపు 15 రాష్ట్రాల నుంచి దాదాపు 300 రైతు సంఘాల కార్యకర్తలు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మహాపంచాయత్‌కు భారీ సంఖ్యలో రైతుల తరలివచ్చిన నేపథ్యంలో పోలీసులు  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని