Afghan Crisis: ఆట వస్తువుల్ని కాల్చివేయండి. ఇదంతా ముందు జాగ్రత్త కోసమే

‘మీ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయండి..మీ గుర్తుల్ని చెరిపేయండి..ఆట వస్తువుల్ని కాల్చివేయండి. ఇదంతా ముందు జాగ్రత్త కోసమే’ అంటూ అఫ్గానిస్థాన్‌కు చెందిన మహిళల సాకర్ జట్టు మాజీ కెప్టెన్ క్రీడాకారుణుల్ని అప్రమత్తం చేశారు.

Published : 20 Aug 2021 01:45 IST

తాలిబన్ల రాకతో.. తమ గుర్తుల్ని చెరిపేసుకుంటోన్న మహిళలు

కాబుల్‌: ‘మీ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయండి..మీ గుర్తుల్ని చెరిపేయండి..ఆట వస్తువుల్ని కాల్చివేయండి. ఇదంతా ముందు జాగ్రత్త కోసమే’ అంటూ అఫ్గానిస్థాన్‌కు చెందిన మహిళల సాకర్ జట్టు మాజీ కెప్టెన్ క్రీడాకారుణుల్ని అప్రమత్తం చేశారు. అఫ్గాన్ తాలిబన్ల వశమైన దగ్గరి నుంచి మహిళలకు గతంలో జరిగిన భయానక అనుభవాలు గుర్తుకువస్తున్నాయి. తమ భవిష్యత్తు గురించిన ఆలోచన వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ క్రమంలో కోపెన్‌ హాగెన్‌లో నివసిస్తోన్న ఖలీదా సోషల్ మీడియాతో మాట్లాడారు. ఆమె అఫ్గాన్‌ మహిళల ఫుట్‌బాల్‌ లీగ్ వ్యవస్థాపకురాలు. ఎప్పుడూ యువతులకు ధైర్యం నూరిపోసే ఆమె.. ఈ సారి అందుకు విరుద్ధంగా స్పందించడం గమనార్హం. 

ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన వీడియో సందేశంలో ఖలీదా మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను వారికి గట్టిగా ఒక విషయం చెప్తున్నా. మీ గుర్తులను చెరిపేయండి. మీ ప్రాణాలు కాపాడుకునేందుకు మీ ఫొటోలను తీసేయండి. మీ జాతీయ జట్టు యూనిఫాంను తగులబెట్టండి. లేదంటే వదిలించుకోండి. ఒక జాతీయ క్రీడాకారిణిగా ఎదిగేందుకు ఎంతో కృషి చేసిన మనకు ఇది చాలా బాధాకరవిషయం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్ల రాకతో మహిళల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉందన్నారు. ‘వారు చాలా భయపడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఆటగాళ్లే కాదు, కార్యకర్తలు కూడా ఆ జాబితాలో ఉన్నారు. వారు ప్రమాదంలో ఉంటే రక్షణ కల్పించడానికి ఎవరూ లేరు. వారికి ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలీక కంగారు పడుతున్నారు. మనం చూస్తున్నది.. మన కళ్ల ముందే ఒక దేశం కూలిపోవడం గురించి. ఇంతకాలం చేసిన ప్రయత్నమంతా వృథా అయినట్లే’ అంటూ భవిష్యత్తు గురించి వాపోయారు. 

తాలిబన్లు తమ గత పాలనలో మహిళల హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. ఇప్పుడు మాత్రం ఇస్లామిక్ చట్టాల పరిధిలో మహిళల హక్కులను గౌరవిస్తామని చెప్తున్నారు. ఏది ఎంతవరకు నిజమో కాలమే చెప్పాలి..!  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని