Updated : 21 Jun 2021 20:27 IST

Corona: ఉపశమనం కలిగించే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశాన్ని వణించిన కరోనా సెకండ్‌వేవ్‌ ఉద్ధృతి తగ్గుతోంది. కొత్త కేసులు, మరణాలు తగ్గుతుండగా.. రికవరీలు పెరుగుదల కొనసాగుతోంది. మరోవైపు, వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సోమవారం నమోదైంది. దిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుదల నమోదైంది. రేపు ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాలకు బస్సు సర్వీసులను కర్ణాటక నడపనుంది. కొవిడ్‌ వేళ ఊరటనిచ్చే కొన్నివార్తలు మీకోసం..

* కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త వ్యాక్సినేషన్‌ పాలసీ నేటినుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో  ఒక్కరోజులోనే భారీగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ జరిగింది. ఈ సాయంత్రం 6.30గంటల సమయానికి దేశవ్యాప్తంగా 75లక్షలకు పైగా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. సోమవారం నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా కేంద్రం ఉచితంగా టీకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. 

* తెలుగు రాష్ట్రాల్లో కొత్త కేసులు దిగి వస్తున్నాయి. తెలంగాణలో గడిచిన 24గంటల వ్యవధిలో 1,19,537 శాంపిల్స్‌ పరీక్షించగా 1197 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా 9మంది మృతిచెందగా.. 1709మంది కోలుకున్నారు. ప్రస్తుతం 17,246 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇకపోతే ఏపీలో కొత్త కేసులు 3వేల కన్నాతక్కువే నమోదయ్యాయి. 55,002 శాంపిల్స్‌ పరీక్షించగా.. 2620 మందిలో వైరస్‌ బయటపడింది. తాజాగా 44మంది మృతిచెందగా.. 7504మంది కోలుకున్నారు. ప్రస్తుతం 58,140 క్రియాశీల కేసులు ఉన్నాయి.

రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 2.98 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 29.35 కోట్ల డోసులు రాష్ట్రాలకు సమకూర్చగా.. 26.36 కోట్ల డోసులు పంపిణీ జరిగిందని తెలిపింది. ప్రస్తుతం 2,98,77,936 డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. 

* దేశంలో కరోనా కేసుల తగ్గుదల కొనసాగుతోంది. కొత్త కేసులు 88 రోజుల కనిష్ఠస్థాయికి చేరాయి. ఆదివారం 13.88 లక్షల శాంపిల్స్‌ పరీక్షించగా.. 53,256 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. మరోవైపు, మరణాలు కూడా కూడా తగ్గుతున్నాయి. కొత్త కేసుల కన్నా రికవరీలే ఎక్కువగా కొనసాగుతున్నాయి.  యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ కిందకు దిగుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.83శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.32%గా కొనసాగుతోంది. భారత్‌లో రికవరీ రేటు 96.36%గా ఉంది. 

కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పలు సంస్థలు ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి. దేశంలో ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతున్న తరుణంలో తమ సంస్థ తరఫున 15లక్షల లీటర్లకు పైగా ప్రాణవాయువును దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు సరఫరా చేసినట్టు వేదాంత గ్రూపు వెల్లడించింది. థర్డ్‌ వేవ్‌ ముప్పు సంకేతాల నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు చర్యలతో సిద్ధంగా ఉన్నట్టు ఆ గ్రూపు సీఈవో సునిల్‌ దుగ్గల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వేదాంత కేర్స్‌ ఇన్సియేటివ్‌లో భాగంగా తమ కంపెనీ దేశవ్యాప్తంగా 21 ఆస్పత్రుల్లో  1410 క్రిటికల్‌ కేర్‌ బెడ్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే, 502 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతో పాటు 10,500 పీపీఈకిట్లను కూడా సమకూర్చిందన్నారు.

* దిల్లీలో కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చింది. సోమవారం 57,128 శాంపిల్స్‌ పరిక్షించగా.. 89మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇదే అత్యల్పం కావడం విశేషం. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.16%కి పడిపోయింది. గత 24గంటల వ్యవధిలో 11మంది మరణించారు. రికవరీ రేటు 98.12శాతంగా ఉంది.

దేశ ప్రజలకు పూర్తి స్థాయిలో డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్లు అందించేందుకు వీలుగా డిసెంబర్‌ నాటికి భారత్‌లో 257 కోట్ల డోసులు ఉంటాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. సోమవారం ఆయన ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో టీకా కేంద్రాన్నిపరిశీలించారు.  కరోనా సమయంలో ఇతర పార్టీల కార్యకర్తలు క్వారంటైన్‌ లేదా ఐసీయూలో ఉంటే భాజపా కార్యకర్తలు మాత్రం తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేశారని ప్రశంసించారు. మరోవైపు, కరోనాను వైరస్‌పై పోరులో కీలక అస్త్రమైన టీకా పంపిణీని మరింత వేగవంతం చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. జులై- ఆగస్టు నాటికి వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గుజరాత్‌ వెళ్లారు. 

* లాక్‌డౌన్‌ కారణంగా నిలిపివేసిన అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను కర్ణాటక మళ్లీ పునరుద్ధరించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో తెలుగు రాష్ట్రాలకు బస్సులు నడపనున్నట్టు కేఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం 6గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్రయాణికులు ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చని, ప్రయాణం సమయంలో ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

కరోనా మూడో ముప్పు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. తమ రాష్ట్రంలో వైద్య సదుపాయాలను  మరింత మెరుగుపరుస్తున్నట్టు రాజస్థాన్‌ ఆరోగ్యమంత్రి రఘు శర్మ తెలిపారు.  200లకు పైగా ఐసీయూ పడకలు జేకే లాన్‌ ఆస్పత్రిలో త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం అక్కడ 800 పడకలు ఉన్నట్టు చెప్పారు. 600 పడకలు కొవిడ్‌ రోగులకు రిజర్వు చేయవచ్చని తెలిపారు. అవసరమైతే వీటన్నింటినీ ఐసీయూ పడకలుగా మారుస్తామని తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని