twitter blue tick: ఇప్పుడు RSS చీఫ్‌ వంతు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాకు బ్లూ టిక్‌ను తొలగించి కాసేపటికే పునరుద్ధరించింది ట్విటర్‌. తాజాగా ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ట్విటర్‌ ఖాతాకు కూడా బ్లూ టిక్‌ తొలగించి మరోసారి వార్తల్లో నిలిచింది.

Updated : 05 Jun 2021 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ట్విటర్‌ బ్లూ టిక్‌ వివాదం కొనసాగుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాకు బ్లూ టిక్‌ను తొలగించి కాసేపటికే పునరుద్ధరించింది ట్విటర్‌. తాజాగా ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ట్విటర్‌ ఖాతాకు కూడా బ్లూ టిక్‌ తొలగించి మరోసారి వార్తల్లో నిలిచింది. మరోసారి విమర్శలు వెల్లువెత్తడంతో అనంతరం బ్లూటిక్‌ను పునరుద్ధరించింది. భాగవత్‌తో పాటు ఆరెస్సెస్‌ నేతలు సురేష్‌ సోనీ, అరుణ్‌ కుమార్‌, సురేష్‌ జోషి, కృష్ణ కుమార్‌ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాలకు బ్లూటిక్‌ తొలగించి పునరుద్ధరించింది.

ఆరు నెలల పాటు ఇనాక్టివేట్‌గా ఉన్న ఖాతాలకు బ్లూ టిక్‌ను తొలగిస్తున్నట్లు ట్విటర్‌ పేర్కొంటోంది. అయితే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి(ఉపరాష్ట్రపతి) ఖాతాను తొలగించడాన్ని కేంద్రం తప్పుపట్టింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయం నుంచి అభ్యంతరం వ్యక్తమవ్వడంతో కాసేపటికే పునరుద్ధరించింది. ఈ క్రమంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌ సహా తదితరుల ఖాతాలను ట్విటర్‌ తొలగించింది. దీనిపై నెటిజన్లు, ఆరెస్సెస్‌ వర్గాల నుంచి ట్విటర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాన్‌ ట్విటర్‌ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్లు వచ్చాయి. ఈ క్రమంలో ట్విటర్‌ వారి బ్లూటిక్‌ను పునరుద్ధరించింది.

భాగవత్‌కు ట్విటర్‌లో సుమారు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన నుంచి ఒక్క ట్వీట్‌ కూడా లేకపోవడం గమనార్హం. ఇదే సమయంలో 2019లో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌ ఖాతాలకు ఇప్పటికీ ట్విటర్‌ బ్లూ టిక్‌ కొనసాగిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. అయితే, సుష్మా స్వరాజ్‌ ఖాతాను ఆమె భర్త కౌశల్‌ స్వరాజ్‌ నేటికీ కొనసాగిస్తున్నారు. కొత్త ఐటీ చట్టం నిబంధనలు, టూల్‌కిట్‌ వ్యవహారంలో కేంద్రం, ట్విటర్‌ మధ్య ఏర్పడిన దూరం బ్లూటిక్‌ వ్యవహారంతో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని