Uddhav Thackeray: ఆయన్ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్‌ ఠాక్రే వార్నింగ్..!

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే .. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)ని ఉద్దేశించి కాస్త ఘాటునే స్పందించారు. రాహుల్‌.. సావర్కర్ పేరు తేవడమే ఇందుకు కారణం. 

Published : 27 Mar 2023 14:25 IST

ముంబయి: ‘నా పేరు సావర్కర్ కాదు.. నేను క్షమాపణ చెప్పను’ అంటూ  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర( Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే(Uddhav Thackeray) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా అనర్హత వేటు పడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ దేవుడిని అవమానించడం మానుకోకపోతే తమ కూటమిలో పగుళ్లు వస్తాయని హెచ్చరించారు. 

‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం కలిసివస్తున్నామని రాహుల్‌తో చెప్పాలనుకుంటున్నాను. మన బంధానికి బీటలు వారేలా ఎలాంటి ప్రకటనలు చేయొద్దు. వారు రెచ్చగొడుతూనే ఉంటారు. కానీ, మనం అదుపుతప్పితే.. మన దేశం నియతృత్వ పాలనలోకి జారిపోతుంది’ అని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. ‘మేం సావర్కర్‌ను దేవుడిలా పరిగణిస్తాం. ఆయన్ను అవమానించడం మానుకోవాలి. భారత్‌ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసిన సమయంలో మీ వెంట సంజయ్ రౌత్ (శివసేన ఉద్ధవ్‌ వర్గం నేత) ఉన్నారు. మేం మీతో ఉన్నాం. మనం చేస్తోన్న పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణకే. సావర్కర్‌ మా దేవుడు. ఆయన్ను అవమానిస్తే సహించమని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను’ అని ఉద్ధవ్‌ ఘాటుగానే స్పందించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉద్ధవ్‌ వర్గం శివసేన, ఎన్సీపీ కూటమిగా ఉన్నాయి. 

అలాగే ఉద్ధవ్‌ వర్గానికి చెందిన సామ్నా కూడా ఈ విధంగానే సంపాదకీయం రాసింది. ‘రాహుల్‌కు జరిగింది అన్యాయమే. అయితే ,సావర్కర్‌ను అవమానించి, సత్యం కోసం జరిగే పోరాటంలో విజయం సాధించలేరు’ అని వ్యాఖ్యానించింది. ‘ నా పేరు సావర్కర్‌ కాదు.. అందువల్ల ఎవరికీ క్షమాపణలు చెప్పను.  నేను నిజాన్నే నమ్ముతా. దాన్నే మాట్లాడతా. ఈ అనర్హతలు నన్నేం చేయలేవు. నా పేరు గాంధీ. గాంధీలు ఎప్పుడూ క్షమాపణలు చెప్పరు’ అంటూ శనివారం రాహుల్‌(Rahul Gandhi) మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని