Ajay Mishra: కుమారుడి గురించి అడిగితే.. విలేకరులపై కేంద్రమంత్రి అజయ్‌ మిశ్ర చిందులు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో రైతులపై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఆయన కుమారుడు

Updated : 15 Dec 2021 18:47 IST

లఖింపుర్‌ ఖేరి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో రైతులపై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఆయన కుమారుడు ఆశిష్‌ మిశ్ర అరెస్టైన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రణాళికతో చేసిన కుట్రే అని సిట్‌ నిన్న వెల్లడించింది. దీనిపై ఆయన్ను ప్రశ్నించగా.. విలేకరులపై చిందులు తొక్కారు. దుర్భాషలాడుతూ వారిని నెట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర నేడు లఖింపుర్‌ జిల్లాకు వెళ్లారు. అక్కడ ఓ ఆసుపత్రిని సందర్శించి బయటకు వస్తుండగా విలేకరులు ఆయన్ను చుట్టుముట్టారు. లఖింపుర్‌ ఖేరి ఘటనపై సిట్ నివేదిక గురించి, ఈ ఘటనలో ఆశిష్‌ మిశ్రాపై నమోదైన హత్యాయత్న అభియోగాల గురించి ప్రశ్నించారు. విలేకరుల ప్రశ్నలతో సహనం కోల్పోయిన అజయ్‌.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ మెదడు పనిచేయట్లేదా? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగకండి. వీళ్లకు సిగ్గులేదు’’ అంటూ దుర్భాషలాడారు. మైక్‌ ఆఫ్‌ చేయు అంటూ ఓ విలేకరిని తోసేశారు. తన కుమారుడు అమాయకుడని, కుట్రపూరితంగా అతడిని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. అనంతరం అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అక్టోబరులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తున్న అన్నదాతలపై అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందగా, అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన.. ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే అని ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న సంచలన విషయాలు వెల్లడించింది. దీంతో ఈ కేసులో నిందితులపై హత్యాయత్న అభియోగాలు నమోదు చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసులో ఆశిష్‌ సహా 13 మంది నిందుతులు అరెస్టై జైల్లో ఉన్నారు. మంగళవారం అజయ్‌ జైలుకు వెళ్లి తన కుమారుడిని కలిశారు.

ఇదిలా ఉండగా.. సిట్‌ నివేదిక నేపథ్యంలో భాజపాపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని