Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనపై మీడియా ప్రశ్న.. కేంద్రమంత్రి పరుగులు

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన గురించి ఓ కేంద్రమంత్రిని మీడియా ప్రశ్నించగా.. ఆమె ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు అవాక్కయ్యారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె అక్కడి నుంచి పరుగులు పెట్టిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

Published : 31 May 2023 12:11 IST

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన (Wrestlers Protest) రోజురోజుకీ ఉద్ధృతంగా మారుతోంది. ఈ క్రమంలోనే రెజ్లర్ల నిరసన గురించి కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakashi Lekhi)ని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ఆమె పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అసలేం జరిగిందంటే..

కేంద్రంలో భాజపా 9ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వచ్చిన కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakashi Lekhi)ని విలేకరులు చుట్టుముట్టారు. ‘‘రెజ్లర్ల ఆందోళన (Wrestlers Protest)పై మీ స్పందన ఏంటి?’’ అని ఆమెను ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మీనాక్షి లేఖి వెళ్తుండగా.. విలేకరులు కూడా ఆమెను అనుసరించారు. అదే ప్రశ్నను మళ్లీ అడగ్గా.. ‘‘న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది’’ అని చెబుతూ ఆమె పరిగెత్తారు. కేంద్రమంత్రి ‘చలో.. చలో.. చలో’ అంటూ తన కారు వద్దకు పరిగెట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఓ మీడియా ఛానల్‌లో ప్రసారమైన ఈ వైరల్‌ వీడియోను కాంగ్రెస్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. విమర్శలు చేసింది. ‘‘మహిళా రెజ్లర్ల ఆందోళన అంశంపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి (Meenakashi Lekhi) ఎంత సూటిగా బదులిచ్చారో మీరే చూడండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.

ఆందోళన చేస్తున్న రెజ్లర్లు (Wrestlers) హరిద్వారాకు వెళ్లకుముందు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు.. కేంద్రం స్పందించనందుకు నిరసనగా తమ పతకాల (Medals)ను గంగా నదిలో కలిపేందుకు మంగళవారం హరిద్వార్‌ (Haridwar) వెళ్లారు. అయితే చివరి క్షణంలో ఖాప్‌, రైతు సంఘాల నేతలు వారిని వారించారు. కేంద్ర ప్రభుత్వానికి కొంత గడువిద్దామని ప్రతిపాదించారు. దీంతో వెనక్కి తగ్గిన రెజ్లర్లు ప్రభుత్వానికి ఐదు రోజులు గడువిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు, పతకాల (Medals)ను గంగా నదిలో కలిపిన తర్వాత ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రెజ్లర్లు హెచ్చరించారు. దీంతో ఇండియా గేట్‌ (India Gate) వద్ద దిల్లీ పోలీసులు (Delhi Police) భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతంలో నిరసనకు తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. అది జాతీయ స్మారకమని, ఆందోళనలకు వేదిక కాదని పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని