
Rahul Gandhi: లఖింపుర్ ఖేరికి వెళ్లేందుకు రాహుల్, ప్రియాంకకు అనుమతి..
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలో మృతిచెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలకు అనుమతి లభించింది. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మరో ముగ్గురు నేతలు లఖింపుర్ ఖేరి వెళ్లేందుకు యూపీ ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. సీఎం యోగి ఆదిత్యానాథ్.. అధికారులతో జరిపిన సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
లఖింపుర్ ఖేరి వెళ్లేందుకు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఇప్పటికే దిల్లీ నుంచి బయల్దేరింది. రాహుల్‌తో పాటు పంజాబ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు చరణ్‌జిత్ సింగ్ చన్నీ, భూపేశ్ భగేల్ ప్రత్యేక విమానంలో లఖ్‌నవూ బయల్దేరారు. లఖ్‌నవూ ఎయిర్‌పోర్టు నుంచి వీరు రోడ్డు మార్గంలో లఖింపుర్ ఖేరి వెళ్లనున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ ఇంకా సీతాపూర్ అతిథిగృహంలో పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. తాజాగా ఆమెకు కూడా లఖింపుర్ వెళ్లేందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆమెను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ ఎయిర్‌పోర్టులో రాహుల్ అడ్డగింత..!
అంతకుముందు దిల్లీ ఎయిర్‌పోర్టులో రాహుల్ బృందాన్ని కొంతసేపు అడ్డుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి. ఈ మధ్యాహ్నం రాహుల్, ఇద్దరు ముఖ్యమంత్రుల డిజిటల్ ఐడీ పీఎన్‌ఆర్‌లను రద్దు చేశారని, వారు విమానం టికెట్లు బుక్ చేసుకోకుండా అడ్డుకున్నారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కొంతసేపటి తర్వాత ఎయిర్‌లైన్ వాటిని పునరుద్ధరించడంతో రాహుల్ బృందం లఖ్‌నవూ బయల్దేరినట్లు తెలిపాయి. అయితే ఈ ఆరోపణలను సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఖండించారు. రాహుల్‌ను అడ్డుకునేందుకు తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.