చార్‌ధామ్‌ యాత్ర లైవ్‌ స్ట్రీమింగ్ కుదరదు

చార్‌ధామ్‌ యాత్రను, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి గర్భాలయాల్లో నిర్వహించే కైంకర్యాలను లైవ్‌స్ట్రీమ్‌ చేయడం కుదరదని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి స్పష్టం చేశారు. హైకోర్టు సూచనపై పలువురితో సంప్రదించామనీ, అయితే  ఇది వేదాలకు విరుద్ధంగా ఉన్నందున ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నామని...

Published : 18 Jul 2021 01:35 IST

ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రను, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి గర్భాలయాల్లో నిర్వహించే కైంకర్యాలను లైవ్‌స్ట్రీమ్‌ చేయడం కుదరదని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి స్పష్టం చేశారు. హైకోర్టు సూచనపై పలువురితో సంప్రదించామనీ, అయితే  ఇది ఆగమాలకు విరుద్ధంగా ఉన్నందున ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నామని తెలిపారు. ఈ మేరకు సీఎం అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

కరోనా ఉద్ధృతి నేపథ్యం ప్రసిద్ధ చార్‌ధామ్‌ యాత్రను ఈ ఏడాదికి పూర్తిగా రద్దు చేయాల్సిందిగా గతంలో ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను తోసిరాజని స్థానిక ప్రజలు, తక్కువ మంది భక్తులతో చార్‌ధామ్‌ యాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి మొదటి దశ, జులై 11 నుంచి రెండో దశ యాత్రను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. వీలైతే ఆయా ఆలయాల్లో నిర్వహించే కైంకర్యాలను లైవ్‌ స్ట్రీమ్‌ ద్వారా ప్రసారం చేసుకోమని సూచించింది.

దీనిపై పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, మతపెద్దలతో సంప్రదింపులు జరిపిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌గా పిలుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని