Published : 15/11/2021 01:37 IST

PLA: మణిపూర్‌లో మళ్లీ పీఎల్‌ఏ కదలికలు..?

 నాలుగు దశాబ్దాలుగా పాతుకుపోయిన ఉగ్రసంస్థ

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌ బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ విప్లవ్‌ త్రిపాఠి సహా అతని భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు, నలుగురు అంగరక్షల హత్యతో ‘పీఎల్‌ఏ’ పేరు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. దీంతోపాటు మణిపూర్‌ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ కూడా ఈ ఘాతుకంలో పాలుపంచుకొంది. కొన్ని దశాబ్దాలుగా ఈ ఉగ్ర సంస్థ ఈశాన్య భారతంలో అరాచకం సృష్టిస్తోంది. దీనికి వెనుక విదేశీ శక్తులు కూడా ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. విప్లవ్‌ త్రిపాఠి మరణానికి ప్రతికారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు యత్నాలను వేగవంతం చేశాయి. 

ఏమిటీ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ..?

‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’ మణిపూర్‌లోని ఓ ఉగ్ర సంస్థ. దీనిని 1978లో ఎన్‌.బిషేశ్వర్‌ ప్రారంభించారు. యూఎన్‌ఎల్‌ఎఫ్‌(యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌) నుంచి వేరుపడి ఆయన దీనిని ఏర్పాటు చేశారు. అందులోని కేడర్‌ కూడా పీఎల్‌ఏలో చేరింది. 1979లో దీని రాజకీయ విభాగం ‘రివల్యూషనరీ పీపుల్స్‌ ఫ్రంట్‌’ (ఆర్‌పీఎఫ్‌)ను ఏర్పాటు చేశారు.  మణిపూర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనైనా భారత్‌ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా మార్చాలన్నది దీని లక్ష్యం. ఇందుకోసం కుకీ, నాగా వేర్పాటువాద బృందాలతో కూడా కలిసి పనిచేసేందుకు పీఎల్‌ఏ సిద్ధపడింది. 

ఇంఫాల్‌ లోయలో పీఎల్‌ఏ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. మార్కిస్ట్‌ భావజాలంతో ఈ గ్రూపు పనిచేస్తోంది. ఈ గ్రూప్‌కు సంబంధించిన కీలక క్యాంప్‌లు మయన్మార్‌లో ఉన్నాయి. వీరి శిక్షణ కూడా అక్కడే కొనసాగుతోంది. మణిపూర్‌లో ప్రభుత్వం పలు వేర్పాటువాద సంస్థలతో ఒప్పందాలు చేసుకొని.. వారిని హింసాత్మక మార్గం నుంచి జనజీవన స్రవంతిలోకి తెచ్చింది. కానీ, పీఎల్‌ఏ మాత్రం ప్రభుత్వంతో ఎటవంటి ఒప్పందాలు చేసుకోలేదు. 

దాడికి చురాచాంద్‌పూర్‌నే ఎందుకు ఎంచుకొంది..?

వాస్తవానికి తాజాగా దాడికి చురాచాంద్‌పూర్‌ను పీఎల్‌ఏ ఎంచుకోవడం భద్రతా వర్గాలను కొంత గందరగోళానికి గురిచేసింది. గతంలో జరిగిన పెద్ద దాడులకు మయన్మార్‌ సరిహద్దుల్లోని ఛండేల్‌ జిల్లా వేదికగా ఉంది. 2015లో డోగ్రా రెజిమెంట్‌పై దాడి చేసి 18 మంది సైనికులను హత్య చేసిన ఘటన కూడా ఛండేల్‌లో చోటుచేసుకొంది. 

2003-04లో చేపట్టిన ఆపరేషన్‌ ఆల్‌ క్లియర్‌ దెబ్బకు ఇక్కడి వేర్పాటు వాద సంస్థలను మయన్మార్‌ నుంచి తరిమేశారు. దీంతోపాటు దాదాపు 20కి పైగా సంస్థలతో ప్రభుత్వం  ఒప్పందాలు చేసుకొని వేర్పాటు వాదం నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇంఫాల్‌ లోయలోని ఉగ్ర గ్రూపులు మయన్మార్‌ను ఆనుకొని ఉన్న ఈ జిల్లా నుంచి పనిచేయవు. ఎందుకంటే ‘ది జోమి రివల్యూషనరీ ఆర్మీ’ (జెడ్‌ఆర్‌ఏ)పేరిట వేరే గ్రూపు ఇక్కడ అత్యంత బలంగా ఉంది. ఈ నేపథ్యంలో జెడ్‌ఆర్‌ఏ అనుమతి లేకుండా ఈ ప్రాంతం నుంచి పీఎల్‌ఏ దాడి చేయడం అసంభవం. అయితే ఈ గ్రూపులు కలిసి పనిచేస్తున్న విషయాన్ని నిఘా వర్గాలు గ్రహించలేకపోయాయి. 

మరోపక్క మయన్మార్‌లో తిరుగుబాటు జరిగి సైన్యం అధికారం చేపట్టాక పరిస్థితులు మారాయి. చురాచాంద్‌పూర్‌ను అనుకొని ఉన్న చిన్‌ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సమాంతర పాలన నడిపే ‘నేషనల్‌ యూనిటీ గవర్నమెంట్‌’ సాయుధ విభాగమైన పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ భారత వేర్పాటు వాద గ్రూపులపై దాడులు చేసింది. దీంతో ఆ గ్రూపులు మళ్లీ భారత్‌లోకి వచ్చిచేరినట్లు అనుమానిస్తున్నారు. 

1990ల తర్వాత ఇప్పుడే..

1990ల్లో నాగాలు, కుకీల మధ్య ఘర్షణల సమయంలో మహిళలు పిల్లలను లక్ష్యంగా చేసుకొన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ ఇక్కడి ఉగ్ర సంస్థలు వీరిని లక్ష్యంగా చేసుకోలేదు. తాజా దాడి తర్వాత కూడా పీఎల్‌ఏ, ఎంఎన్‌ఎఫ్‌లు స్పందిస్తూ.. వాహనంలో కమాండింగ్‌ ఆఫీసర్‌ భార్య, కుమారుడు ఉన్న విషయం తెలియదని చెప్పాయి. దాదాపు ఐదారేళ్లుగా స్తబ్దుగా ఉన్న పీఎల్‌ఏ ఒక్కసారిగా భారీ దాడి చేయడం భద్రతా దళాలను కలవర పరుస్తోంది. 

చర్చలకు రాని మెయితియ్‌ లోయ గ్రూపులు..

ప్రస్తుతం మణిపూర్‌లో మొత్తం ఆరు గ్రూపులు చురుగ్గా ఉన్నాయి. వీటిల్లో యూఎన్‌ఎల్‌ఎఫ్‌, పీఎల్‌ఏ, కేసీపీ, కేవైకేఎల్‌, పీఆర్‌ఈపీఏకే, ఎంపీఎల్‌ఎఫ్‌ గ్రూపులు పనిచేస్తున్నాయి. ఇవన్నీ మయన్మార్‌ కేంద్రంగా పనిచేస్తున్నాయి.  బలవంతపు వసూళ్లకు పాల్పడి ఆ నిధులతో ఆయుధాలు కొనుగోలు చేస్తోన్నాయి. ఈ గ్రూపులు భారత దళాలపై దాడులకు గెరిల్లా యుద్ధతంత్రాలను వాడుతున్నాయి. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని