WhatsApp: ఒక్క నెలలోనే 18 లక్షల ఖాతాలపై నిషేధం

నిబంధనలు అతిక్రమించే యూజర్లపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సాప్‌’ వెల్లడించింది. ఈ క్రమంలో మార్చి నెలలోనే 18.05లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు పేర్కొంది.

Published : 03 May 2022 01:51 IST

మార్చి నెల నివేదికల వెల్లడించిన వాట్సాప్‌

దిల్లీ: నిబంధనలు అతిక్రమించే యూజర్లపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సాప్‌’ వెల్లడించింది. ఈ క్రమంలో మార్చి నెలలోనే 18.05లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు పేర్కొంది. యూజర్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెలవారీ నివేదికలో వాట్సాప్‌ తెలిపింది. అంతకుముందు నెలలోనూ దేశవ్యాప్తంగా 14.22 లక్షల ఖాతాలను నిషేధించినట్లు  వాట్సాప్‌ వెల్లడించింది.

‘వినియోగదారుల భద్రత నివేదికలో యూజర్‌ ఫిర్యాదులు, తీసుకున్న చర్యలను పొందుపరుస్తాం. వీటితోపాటు ప్లాట్‌ఫాంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిని ఎప్పటికప్పుడు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ క్రమంలో గ్రివెన్స్‌ సెల్‌కు మార్చి నెలలో 597 ఫిర్యాదులు అందగా.. వాటిలో 74 అకౌంట్లపై చర్యలు తీసుకున్నాం. వీటితోపాటు వాట్సాప్‌లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వేదికలో ఉండే స్వతంత్ర నివారణ చర్యల ద్వారా లక్షల అకౌంట్లపై నిషేధం విధిస్తున్నాం ’ అని తాజా నివేదికలో వాట్సాప్‌ పేర్కొంది.

గతేడాది అమల్లోకి వచ్చిన నూతన ఐటీ నిబంధనల ప్రకారం, 50లక్షలకుపైగా యూజర్లు ఉన్న డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు వాటికి సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి నివేదిక అందించాలి. ఇందులో భాగంగానే వాట్సాప్‌ ఈ వివరాలు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని