PM Modi: ప్రపంచం చూపు.. మళ్లీ ఆయుర్వేదం వైపు

ప్రపంచ దేశాలు ఎన్నో చికిత్సా విధానాలను ప్రయత్నించిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు ప్రాచీన ఆయుర్వేదం వైపు చూస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 11 Dec 2022 20:43 IST

పణజీ: ఎన్నో చికిత్సా విధానాలను ప్రయత్నించిన తర్వాత ప్రపంచం మొత్తం మళ్లీ ఆయుర్వేద (Ayurveda) వైద్య విధానంవైపే చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గోవాలో జరుగుతోన్న 9వ ప్రపంచ ఆయుర్వేద సమావేశం (WAC), ఆరోగ్య ఎక్స్‌పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. వైద్య నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు.

‘ప్రపంచం ఎన్నో చికిత్సా విధానాలను ప్రయత్నించింది. చివరకు మళ్లీ అత్యంత పురాతనమైన ఆయుర్వేదం (Ayurveda) వైపు చూస్తోంది. ఆయుర్వేద అనేది కేవలం భౌతిక ఆరోగ్యం గురించే కాదు.. పూర్తి ఆరోగ్యానికి సంబంధించినది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే 30దేశాలు సంప్రదాయ వైద్య విధానంగా అంగీకరించడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. దీనిని మరిన్ని దేశాలకు విస్తరించాలని ఆకాంక్షించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు (2014లో) రూ.20వేల కోట్ల ఇండస్ట్రీగా ఉన్న ఆయుర్వేదం.. ఇప్పుడు రూ.1.50లక్ష కోట్లకు చేరుకుందన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి పెరుగుతోన్న ఆదరణ దృష్ట్యా.. ఔషధ మొక్కలు పెంచడం వంటి చర్యలతో ఉద్యోగ కల్పనను మరింత పెంచుకోవచ్చని సూచించారు.

ఆయుర్వేదంపై ఇప్పటికే ఎంతో పరిశోధనలు జరుగుతున్నాయన్న మోదీ.. కరోనా సమయంలోనూ వేల పరిశోధనా పత్రాలను రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే దేశంలో జాతీయ ఆయుష్‌ రీసెర్చ్‌ కన్సార్టియం అందుబాటులోకి వస్తుందని చెప్పిన మోదీ.. అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రం గుజరాత్‌లో రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (గోవా), ఘజియాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌, దిల్లీ కేంద్రంగా ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌లలోని నిపుణులను ఉద్దేశించి గోవా నుంచి వర్చువల్‌గా మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని