ఓటీటీలో మెరిసిన అగ్ర తార ఎవరు?

‘‘హీరోకి జోడీగా తెరపై గ్లామర్‌ ఒలికించడం.. స్టెప్పులతో సినీప్రియుల్ని మురిపించడం..సినిమాల్లో నాయికల పాత్ర ఇక్కడికే పరిమితం’’.. - కథానాయికల

Updated : 20 Dec 2020 14:52 IST

‘‘హీరోకి జోడీగా తెరపై గ్లామర్‌ ఒలికించడం.. స్టెప్పులతో సినీప్రియుల్ని మురిపించడం..సినిమాల్లో నాయికల పాత్ర ఇక్కడికే పరిమితం’’.. - కథానాయికల విషయంలో ఇలాంటి మాటలు గతంలో బాగా వినిపించేవి. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు రాబట్టే మంత్రాన్ని, సోలోగా సినీప్రియుల్ని రంజింపజేసే తంత్రాన్ని కథానాయికలు ఎప్పుడో చక్కగా వంటబట్టించేసుకున్నారు. మంచి కథతో దగ్గరకి రావాలే కానీ.. అగ్ర హీరోలకు దీటుగా బాక్సాఫీస్‌ ముందు దుమ్ములేపుతున్నారు. నయనతార, అనుష్క, కీర్తిసురేష్‌ లాంటి స్టార్‌ నాయికలంతా ఈ విషయంలో ఎప్పుడో ఆరితేరారు. ఇప్పుడీ భామలే కరోనా కాలంలోనూ ఓటీటీ వేదికగా సినీప్రియులకు వినోదాల విందు అందించారు. వెండితెరపై అగ్ర హీరోలు కనిపించని లోటును.. తమ చిత్రాలతో భర్తీ చేసి చూపించారు. మరి వీళ్లలో హిట్టు మాట వినిపించుకున్న ఆ నాయికలెవరో? చదివేద్దాం...

కీర్తి డబుల్‌ ట్రీట్‌..

‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో మెరిసి.. నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారింది కీర్తి సురేష్‌. ఈ ఏడాది ఓటీటీ వేదికగా ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ చిత్రాలతో సినీప్రియులకు వినోదాల విందు వడ్డించింది. కీర్తి ‘పెంగ్విన్‌’తో ఓటీటీలోకి అడుగుపెట్టాకే.. ‘వి’, ‘నిశ్శబ్దం’ లాంటి బడా చిత్రాలూ ఈ వేదికల వైపు అడుగులు వేశాయి. ఈ థ్రిల్లర్‌ చిత్రం ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేయడంలో కాస్త తడబడినా.. ఓటీటీ వైపు సినీప్రియుల్ని ఆకర్షితుల్ని చేయడంలో పైచేయి సాధించింది. ఇక ఇటీవల విడుదలైన ‘మిస్‌ ఇండియా’ మాత్రం మిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన మరో నాయికా ప్రాధాన్య చిత్రం ‘గుడ్‌లక్‌ సఖీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కూడా ఓటీటీ వైపే అడుగువేయనుందని సమాచారం.

‘నిశ్శబ్దం’గా  వచ్చి వెళ్లిన స్వీటీ..

నాయికా ప్రాధాన్య చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించిన నాయికల్లో అందరి కంటే ఓ మెట్టు పైన ఉంటుంది అనుష్క. వెండితెరపై ‘భాగమతి’గా ఆమె విశ్వరూపం చూశాక..దాదాపు రెండున్నరేళ్ల పాటు ఆమెను తెరపై చూసే వీలు కలగలేదు. ఆ నిరీక్షణలకు ఈ లాక్‌డౌన్‌లోనే ‘నిశ్శబ్దం’గా తెరదించింది అనుష్క. ఓ విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంతోనే సినీప్రియులకు వినోదాన్ని పంచింది స్వీటీ. ఇందులో బధిర యువతిగా అనుష్క అభినయం అందరినీ ఆకట్టుకున్నప్పటికీ.. కథ, కథనాల పరంగా ఈ చిత్రం అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్రం కూడా సినీ ప్రియుల్ని ఓటీటీ వైపు ఆకర్షితుల్ని చేయడంలో విజయం సాధించిందనే చెప్పాలి.

నవ్వుల ‘అమ్మోరు తల్లి’..

దక్షిణాదిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నాయికగా పేరు తెచ్చుకున్న నటి నయనతార. ఓవైపు అగ్రహీరోలతో ఆడిపాడుతూనే నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తోంది. ఇటీవలే ‘అమ్మోరు తల్లి’ చిత్రంతో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని పలకరించింది. భక్తి పేరుతో దొంగ బాబాలు చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇందులో ముక్కుపుడక అమ్మోరుగా నయన్‌ అభినయం.. ఆ పాత్రలో ఆమె పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అమ్మవారి పాత్రలో ఆమె దైవత్వం ఎలా చూపించిందో.. వినోదాత్మక సన్నివేశాల్లో అంతే నవ్వించి మెప్పించింది. అందుకే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.

అనుకోని అతిథిలా.. పాయల్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో యువతరాన్ని అలరించిన నాయిక పాయల్‌ రాజ్‌పుత్‌. ఇటీవల కాలంలో ఎక్కువగా గ్లామర్‌ పాత్రలతోనే కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ లాక్‌డౌన్‌లో ‘అనుకోని అతిథి’లా ఓటీటీ వేదికగా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ చిత్రంలో.. మల్లి అనే ప్రతినాయిక ఛాయలున్న డీగ్లామర్‌ పాత్రలో పాయల్‌ ఆకట్టుకుంది. ముఖ్యంగా దర్శకుడు కథ నడిపించిన విధానం.. పాయల్‌ పాత్రని తీర్చిదిద్దిన తీరు.. నేపథ్య సంగీతం.. ఇవన్నీ ప్రేక్షకులనెంతో మెప్పించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని