గుండెల్లో మోసుకెళ్లే చిత్రం... ‘రిపబ్లిక్‌’

‘‘సినిమాలు మొదలు పెట్టాక నేను మా అన్నయ్య సహకారం తీసుకోలేదు. మా మేనల్లుళ్లు తేజ్‌, వైష్ణవ్‌ కూడా సొంత కాళ్లపై నిలబడాలనే సూచించా. అందుకే వాళ్ల సినిమాల వేడుకలకి నేను గతంలో హాజరు కాలేదు’’ అన్నారు...

Updated : 26 Sep 2021 07:20 IST

‘‘సినిమాలు మొదలు పెట్టాక నేను మా అన్నయ్య సహకారం తీసుకోలేదు. మా మేనల్లుళ్లు తేజ్‌, వైష్ణవ్‌ కూడా సొంత కాళ్లపై నిలబడాలనే సూచించా. అందుకే వాళ్ల సినిమాల వేడుకలకి నేను గతంలో హాజరు కాలేదు’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ఆయన ముఖ్య అతిథిగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ‘రిపబ్లిక్‌’ ముందుస్తు విడుదల వేడుక జరిగింది. సాయి తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. దేవా కట్టా దర్శకత్వం వహించారు. జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మాతలు. అక్టోబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ఈ రోజు ప్రత్యేకించి ఈ వేడుకకి రావడానికి కారణం నిర్మాతలు. ఇంత ఖర్చుపెట్టి సినిమా తీశారు. అందరూ ఆనందంగా ఉండాల్సిన విడుదల సమయంలో తేజ్‌ మోటర్‌బైక్‌ ప్రమాదానికి గురి కావడం బాధాకరమైన విషయం. నిర్మాతలకి ఆ హీరో అందుబాటులో లేని లోటు కనిపించకుండా ఏదో ఒకటి చేయాలని ఈ వేడుకకి వచ్చా. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి సాయి తేజ్‌. తను నటించిన ఈ సినిమా బాగా ఆడాలి, బాగా వచ్చిందని అర్థమవుతోంది ట్రైలర్‌ చూస్తుంటే. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘అన్నయ్య సాయి తేజ్‌ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ప్రమాద సమయంలో వేగంగా స్పందించి అన్నయ్యని ఆస్పత్రికి తీసుకెళ్లిన అందరికీ కృతజ్ఞతల’’న్నారు. దేవా కట్టా మాట్లాడుతూ ‘‘పవన్‌కల్యాణ్‌ గళాన్ని, వ్యక్తిత్వాన్ని ఆరాధించే వ్యక్తిగా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నా. ఆయన ఈ వేడుకకి రావడం వల్ల మాకెంతో మేలు జరుగుతోంది. మేమంతా ఇక్కడి వరకు రావడానికి కారణం తేజ్‌నే. నాకు చాలా ఆత్మవిశ్వాసాన్నిచ్చి ఈ సినిమాని పూర్తి చేసేలా తోడ్పాటుని అందించారు. కథ చెప్పిన రోజు నుంచి పూర్తిగా నాపైనే వదిలేశారు నిర్మాతలు. ఈ సినిమాలోని ప్రతి మాట ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుందని ఆశిస్తున్నా. థియేటర్లో వదిలిపోయే సినిమా కాకుండా గుండెల్లో మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లే సినిమా అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘‘వరుసగా రెండు విజయాల తర్వాత సాయితేజ్‌ ఒప్పుకొన్న కథే... ఈ ‘రిపబ్లిక్‌’. తన మనసు బంగారం. ఈ సినిమా ప్రారంభమయ్యాక రెండు దశల్లో కరోనా, రెండుసార్లు లాక్‌డౌన్‌ని    ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడ్డామ’’న్నారు. క్రిష్‌ జాగర్లమూడి మాట్లాడుతూ  ‘‘రిపబ్లిక్‌’  సాయి తేజ్‌కే కాదు, పరిశ్రమకి కూడా చాలా ముఖ్యమైన చిత్రం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి చిత్రబృందం అందరికీ మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘దేవా కట్టా తపన ఉన్న దర్శకుడు.  తేజ్‌కి ప్రమాదం జరిగినా సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతోందంటే మెగా అభిమానులే కారణ’’మన్నారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్‌ మలినేని, మారుతి, బి.వి.ఎస్‌.రవి, కిషోర్‌ తిరుమల, రవివర్మ, మనోజ్‌ నందం, శ్రీకాంత్‌, సుకుమార్‌, ఐశ్వర్య రాజేశ్‌ కళామందిర్‌ కల్యాణ్‌, నవీన్‌రెడ్డి, నవీన్‌, ప్రసాద్‌ నిమ్మకాయల పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని