ఆ చిత్రానికి 20 ఏళ్లు..!

‘ఆన.. ఆన.. అమ్మ మీద ఆన.. పల్నాటి సీమ మీద ఆన.. అందరూ వస్తే గీత దాటి రండి.. ఒక్కొక్కరు వస్తే గిరిలోకి రండి.. పలికే పళ్లు జాగ్రత్త.. చూసే కళ్లు జాగ్రత్త.. రాలిపడతాయ్‌’ అంటూ సమాజంలోని దౌర్జన్యాలపై వెంకటేశ్‌ కన్నెర్ర చేసిన చిత్రం ‘జయం మనదేరా!’. ఎన్‌.శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై బుధవారంతో...

Updated : 07 Oct 2020 11:56 IST

ఆసక్తికర విషయాలు తెలుసా..!

హైదరాబాద్‌: ‘ఆన.. ఆన.. అమ్మ మీద ఆన.. పల్నాటి సీమ మీద ఆన.. అందరూ వస్తే గీత దాటి రండి.. ఒక్కొక్కరు వస్తే గిరిలోకి రండి.. పలికే పళ్లు జాగ్రత్త.. చూసే కళ్లు జాగ్రత్త.. రాలిపడతాయ్‌’ అంటూ సమాజంలోని దౌర్జన్యాలపై వెంకటేశ్‌ కన్నెర్ర చేసిన చిత్రం ‘జయం మనదేరా!’. ఎన్‌.శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై బుధవారానికి 20 సంవత్సరాలు. వెంకటేశ్‌ ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన ఈ సినిమాలో భానుప్రియ, సౌందర్య కథానాయికలుగా నటించారు.


కథేంటి: అభిరామ్‌(వెంకటేశ్‌) లండన్‌లో స్థిరపడిన తెలుగు కుర్రాడు. థమ్సప్‌ లక్కీడ్రాలో యూరప్‌ చూసేందుకు వచ్చిన ఎనిమిది మంది తెలుగు వారికి గైడ్‌గా వెళతాడు. టూర్‌లో భాగంగా ఉమ(సౌందర్య)తో పరిచయం ఏర్పడుతుంది. అలా వారిద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఒకరికొకరు చెప్పుకోరు. ఉమ ప్రేమ గురించి తెలుసుకున్న అభిరామ్‌ తండ్రి గంగాధరం నాయుడు (ఆహుతి ప్రసాద్‌) ఓ రోజు పార్టీలో ఆమెను అవమానించేలా మాట్లాడతాడు. ఆయన మాటలకు నొచ్చుకున్న ఉమ ఎవరికీ చెప్పకుండా భారత్‌కి వచ్చేస్తుంది. ఉమ ప్రేమను తెలుసుకున్న అభిరామ్‌ తండ్రితో గొడవపడి ఆమె కోసం ఇండియాకి వస్తాడు. ఆ సమయంలో నరసింహానాయుడు(జయప్రకాశ్‌ రెడ్డి) మనుషులు అభిరామ్‌పై దాడికి దిగుతారు. ప్రమాదంలో ఉన్న అభిరామ్‌ని భవానీ(ఝాన్సీ) రక్షిస్తుంది. అనంతరం వారిద్దరూ మహాదేవనాయుడు(వెంకటేశ్‌), భువనేశ్వరి(భానుప్రియ) దంపతులకు పుట్టిన సంతానమని చెబుతుంది. సమాజంలోని వర్ణ, కుల వివక్ష రూపుమాపడానికి తమ తండ్రి చేసిన పోరాటం గురించి అభిరామ్‌కి తెలియజేస్తుంది. సమాజంలో అరాచకాలకు పాల్పడుతున్న నరసింహానాయుడు, అతని సోదరులు కలిసి.. మహాదేవనాయుడిని మోసం చేసి విషం పెట్టి చంపారని వివరిస్తుంది. దీంతో తన తండ్రికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న అభిరామ్‌.. నరసింహానాయుడి కుటుంబాన్ని ఎలా శిక్షించాడు? తల్లిని ఎలా కాపాడుకున్నాడు? అలాగే తన తండ్రి మరణంతో ఊరు నుంచి వెళ్లిపోయిన ప్రజల్ని ఎలా తన సొంతూరికి రప్పించాడు అనేది కథ.


‘జయం మనదేరా’ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా సంగీతం విషయంలో ఓ చిన్న సంఘటన ఉంది. ఎన్‌.శంకర్‌కి మొదటి చిత్రం నుంచి వందేమాతరం శ్రీనివాస్‌తో కలిసి పనిచేయడం చాలా ఇష్టం. అదే విషయాన్ని వెంకటేశ్‌కి చెప్పగా.. ‘ఆయన విప్లవ సినిమాలకు సంగీతం అందిస్తారు కదా! ఈ సినిమాకు చేయగలరా’ అని అడిగారట. అప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ ఒక షరతు పెట్టింది. ‘ఈ సినిమాలో మీరిచ్చే పాటలు నచ్చితే.. సంగీత దర్శకుడిగా మీ పేరు వేస్తాం. లేకపోతే  వేయం’ అని చెప్పడంతో శ్రీనివాస్‌ దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని సినిమాకి మంచి పాటలు అందించారు.


‘జయం మనదేరా’ సినిమా క్లైమాక్స్‌ విషయంలో కూడా సృజనాత్మక విభేదాలు వచ్చాయని దర్శకుడు ఎన్‌.శంకర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమా కోసం తాను రాసుకున్న ఒరిజినల్‌ క్లైమాక్స్ వేరేలా ఉంటుందట. అయితే తాను చెప్పిన క్లైమాక్స్‌ విన్న వెంకటేశ్‌.. సినిమాలోని చివరి సన్నివేశాలు కొంచెం మాస్‌గా ఉండాలని.. ఓ హిందీ సినిమాలో ఉన్నట్లు చేద్దామని అన్నారట. అప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. ‘రెండు క్లైమాక్స్‌లూ చిత్రీకరిద్దాం. ఏది బాగుంటే దాన్ని పెట్టి సినిమా విడుదల చేద్దాం’ అని చెప్పిందట. దీంతో మొదట హిందీ సినిమాని ఆధారంగా చేసుకుని ఓ మాస్‌ క్లైమాక్స్‌ని చిత్రీకరించారు. సమయం లేకపోవడంతే ఆ క్లైమాక్స్‌తోనే సినిమాని విడుదల చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని