Alia Bhatt: ఈ పురస్కారం మీదే

భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటోంది బాలీవుడ్‌ నాయిక అలియా భట్‌. ఎలాంటి కష్టతరమైన పాత్రలోనైనా.. అలవోకగా నటించి మెప్పిస్తోంది. తన నటనతో ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకుంది ఈ భామ.

Updated : 26 Aug 2023 14:03 IST

భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటోంది బాలీవుడ్‌ నాయిక అలియా భట్‌. ఎలాంటి కష్టతరమైన పాత్రలోనైనా.. అలవోకగా నటించి మెప్పిస్తోంది. తన నటనతో ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకుంది ఈ భామ. తాజాగా ‘గంగూబాయి కాఠియావాడి’ సినిమాలోని తన పాత్రకు గానూ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ‘‘దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతో పాటు చిత్రబృందానికి, నా కుటుంబానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఈ జాతీయ అవార్డు మీదే. ఎందుకంటే మీరు లేకుండా ఇది సాధ్యం కాదు. నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నాకు వీలైనంత కాలం మీకు వినోదాన్ని పంచాలని కోరుకుంటూ.. మీ గంగూ’ అంటూ చెప్పుకొచ్చింది అలియా.


అనుకున్నట్టే గెలిచాను

బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ సినిమా రంగంలో మంచి విజయాలతో రాణిస్తోంది. ఆమె ఇటీవల జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ ఆనందాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది కృతి. ‘‘నేను ఆ రోజు సాయంత్రం ఓ మీటింగ్‌లో ఉన్నాను. ఉన్నట్టుండి కాల్స్‌ రావడం మొదలైయ్యాయి. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. సాధారణంగా మీటింగ్‌ సమయాల్లో నేను ఫోన్‌ వాడను. అంతలా కాల్స్‌ రావడంతో మీటింగ్‌ మధ్యలో బయటికి వచ్చి కాల్‌ ఆన్సర్‌ చేసి నేనందుకున్న విజయం గురించి విన్నాను. ఆ సమయంలో అంత శూన్యంలా అనిపించింది. జీవితంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న సంతోషాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుందామని వారి దగ్గరికి వెళ్లాను’’ అంటూ తన ఆనంద క్షణాల్నీ గుర్తు చేసుకుంది. ‘మా ఇంట్లో న్యూ ఇయర్‌ అయినా లేదా ఏ వేడుకైనా పిజ్జాతో మొదలవుతుంది(నవ్వుతూ). ఆ రోజు నా గెలుపు గురించి తెలిసిన తర్వాత కూడా మా అమ్మ...‘కొన్ని పిజ్జాలు ఆర్డర్‌ చేద్దాం’ అని అన్నారు. ఆ మధురమైన క్షణాన్ని పిజ్జాతో సెలబ్రేట్‌ చేసుకున్నాము’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. అభిమానులకు, దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ...‘నేను పడిన కష్టానికి, చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం దక్కింది. నా జీవితం, నా కలలు, నా లక్ష్యాల గురించి డైరీలో రాసిపెట్టుకుంటాను. ‘మిమీ’లో పనిచేసిన తర్వాత ఆ సినిమాలో నా నటనకు జాతీయ అవార్డు వస్తుందని డైరీలో రాసుకున్నాను. అనుకున్నట్టుగానే గెలిచాను’ అంటూ చెప్పుకొచ్చింది కృతి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు