Anand Deverakonda: మా ఇద్దరి దారులు వేరు!

‘‘నా సినీ ప్రయాణంలో ‘బేబి’ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. థియేట్రికల్‌గా నాకు తొలి విజయాన్ని అందించే సినిమా అవుతుంద’న్నారు కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ.

Updated : 13 Jul 2023 14:04 IST

‘‘నా సినీ ప్రయాణంలో ‘బేబి’ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. థియేట్రికల్‌గా నాకు తొలి విజయాన్ని అందించే సినిమా అవుతుంద’న్నారు కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ. విజయ్‌ దేవరకొండ తమ్ముడు అనే గుర్తింపుతో ప్రయాణం మొదలుపెట్టి, తనదైన ముద్రని వేసే ప్రయత్నంలో ఉన్నారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఆయన బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.

‘‘ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. ఆ భావోద్వేగాల్ని పతాక స్థాయిలో ఆవిష్కరించే చిత్రమిది. ఇందులోని ప్రేమని దర్శకుడు సాయిరాజేశ్‌ తనదైన కోణంలో చూపించారు. ఆయన రచన, చూపించిన ప్రేమ కొత్తగా ఉంటుంది. కథానాయకుడిగా నేను ఇప్పటివరకూ పక్కింటి అబ్బాయిలా కనిపించే పాత్రలే చేశా. కానీ తొలిసారి ఎక్కువ మంది ప్రేక్షకుల మనసుల్ని తాకే ఓ విస్తృతమైన కథలో నటించాననే భావన కలిగింది’’.

‘‘తొలిప్రేమ ఓ అందమైన అనుభూతి. అది మనసు పొరల్లో ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ప్రేమ ఫలించినా, విఫలమైనా గుర్తుండిపోతుంది. ప్రేమ అర్థాన్ని ఎలా ఎప్పుడు తెలుసుకుంటారనేది ఇందులో చాలా బాగా చూపించారు దర్శకుడు. ‘ప్రేమదేశం’ సినిమాకీ ‘బేబి’కి ఎలాంటి సంబంధం ఉండదు. అయితే ఈ సినిమా ఇచ్చే అనుభూతి మాత్రం ‘ప్రేమిస్తే’, ‘7/జి బృందావన కాలని’ తరహా సినిమాల్ని గుర్తు చేస్తుంది. మా అన్న విజయ్‌తో ‘టాక్సీవాలా’ చేస్తున్నప్పుడే నిర్మాత ఎస్‌.కె.ఎన్‌. ‘నీతో ఓ మంచి సినిమా చేస్తా’ అని చెప్పేవారు. ఛాయాగ్రాహకుడు బాల్‌రెడ్డి, సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గానిన్‌ ఈ సినిమాకి మరింత బలాన్నిచ్చారు’’.

‘‘కథకి తగ్గట్టుగా భిన్న కోణాల్లో కనిపించాల్సి వచ్చింది. స్కూల్‌ వయసులో కనిపించేందుకు పెద్దగా కష్టపడలేదు కానీ, డబ్బింగ్‌ సమయంలో మాత్రం సవాళ్లు ఎదురయ్యాయి. చిన్న పిల్లాడిలా అనిపించేందుకు నా గొంతు తగ్గించి మాట్లాడాల్సి వచ్చింది. ఆ గొంతులో అమాయకత్వం తీసుకురావల్సి వచ్చింది. అలాగే ఈ పాత్ర కోసం ఆటో నడపడం నేర్చుకున్నా. వైష్ణవి చైతన్యతో కలిసి నటించడాన్ని ఆస్వాదించా’’.

‘‘కథల విషయంలో నిర్ణయం నాదే. ఇది చేయి, అది వద్దు అని మా అన్న కానీ, నాన్న కానీ ఎప్పుడూ చెప్పరు. సినిమాల విషయంలో విజయ్‌ దారి వేరు, నా దారి వేరు. మా ఇద్దరినీ పోల్చి చూడకూడదు. కాకపోతే ఎవరితో ఎలాంటి సినిమా చేస్తున్నాననేది మాత్రం అన్నతో చెబుతుంటా. ‘బేబి’ ట్రైలర్‌ని చూసి తను చాలా సంతోషించాడు. ‘మంచి సినిమా చేశావ్‌... బాగా నటించావ్‌’ అన్నాడు. ప్రస్తుతం ‘గం గం గణేశా’ అనే సినిమా చేస్తున్నా’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని