icon icon icon
icon icon icon

సిక్కోలు రా‘మ్మోహన రాగం’

ఉత్తరాంధ్ర తీర జిల్లా శ్రీకాకుళం. వర్షపాతం ఎక్కువ. కానీ వాన నీటి ఆధారంగా ప్రాజెక్టులు సిద్ధం కాలేదు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ వంటి నదులు పారుతున్న ఈ నేలపై వ్యవసాయమే ప్రధాన ఆదరువు.

Updated : 06 May 2024 09:44 IST

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో కింజరాపు దూకుడు
సొంత ఇమేజ్‌, ప్రభుత్వ వ్యతిరేకతతో హ్యాట్రిక్‌ దిశగా దూసుకుపోతున్న రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

త్తరాంధ్ర తీర జిల్లా శ్రీకాకుళం. వర్షపాతం ఎక్కువ. కానీ వాన నీటి ఆధారంగా ప్రాజెక్టులు సిద్ధం కాలేదు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ వంటి నదులు పారుతున్న ఈ నేలపై వ్యవసాయమే ప్రధాన ఆదరువు. తీర ప్రాంతం ఉండటంతో చేపల వేటా జీవనాధారమే. ఇక్కడ అవకాశాల్లేక మత్స్యకారులు గుజరాత్‌ వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. వంశధార వంటి ప్రధాన ప్రాజెక్టులనూ వైకాపా సర్కారు పూర్తి చేయలేకపోయింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉత్తమాటగానే మిగిలిపోయింది. పరిశ్రమలు అంతంత మాత్రం. ఉపాధి కోసం యువత ఎదురుచూస్తోంది. ఐదేళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు పడకేశాయి. ఈ జిల్లాలో కీలక లోక్‌సభ నియోజకవర్గం శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెదేపా నుంచి హ్యాట్రిక్‌ విజయం దిశగా దూసుకెళ్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిందటి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఎదురుగాలి వీచినా ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు వైకాపా అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో.. మరోసారి రా‘మ్మోహన రాగమే’ వినిపించే సంకేతాలు కనిపిస్తున్నాయి.

కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడిగా రామ్మోహన్‌నాయుడికి ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉంది. యువతలో మంచి పట్టుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సొంత మనుషులున్నారు. వర్గ సమీకరణాల నేపథ్యంలో ప్రజామద్దతు అధికమే. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర అంశాలపై ఆయన లోక్‌సభలో గట్టిగా మాట్లాడటం ప్రజల్లో మంచి పేరు తెచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి తండ్రి తరహాలోనే ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందని ఓటర్లు ఆశిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుండే రామ్మోహన్‌నాయుడు స్థానికంగానే ఉపాధి కల్పించే కార్యక్రమాలపై దృష్టి సారించాల్సి ఉంది. తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధి రామ్మోహన్‌నాయుడికి బలం. మాట తీరు, అందరినీ వెంటబెట్టుకెళ్లగలిగే నేర్పు ఆయనకు ప్రధాన ఆయుధాలవుతున్నాయి. శ్రీకాకుళం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో క్యాడర్‌, నాయకులను సమన్వయం చేస్తూ తన గెలుపుతో పాటు అసెంబ్లీ అభ్యర్థుల గెలుపులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు.


సమన్వయం లేక తిలక్‌ ఉక్కిరిబిక్కిరి

వైకాపా నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పేరాడ తిలక్‌ బరిలో నిలిచారు. ఈ లోక్‌సభ పరిధిలోని ఏ శాసనసభ నియోజకవర్గంలోనూ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవటం ఆయనకు పెద్ద సమస్య. తన సొంత నియోజకవర్గం టెక్కలిలో ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు, తిలక్‌కు మధ్య సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రమే. కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు తమకు ఓటేయమని అడుగుతున్నారు తప్ప తిలక్‌ పేరెత్తడం లేదు. పైగా జగన్‌ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం, 22 మంది ఎంపీలను ఇచ్చినా జగన్‌ చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడం ప్రతికూలాంశాలు అవుతున్నాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, టెక్కలి, పాతపట్నం శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.


అవతలిపక్షం అరాచకమే అచ్చెన్నకు శ్రీరామరక్ష

నియోజకవర్గం: టెక్కలి

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి గెలుపు వైపు అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెదేపా 23 స్థానాలకే పరిమితమైనప్పుడు కూడా అచ్చెన్న ఇక్కడ గెలుపొందారు. 2014-19 వరకు నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులను ప్రజలు వైకాపా పాలనతో పోల్చి చూస్తున్నారు. నియోజకవర్గంలో తెదేపా హయాంలో వేసిన రోడ్లు, నిర్మించిన మంచినీటి పథకాలు ఇప్పటికీ అక్కరకు వస్తున్నాయని గుర్తుచేసుకుంటున్నారు. కిందటి ఎన్నికల్లో వైకాపాకు మెజారిటీ వచ్చిన టెక్కలి, నందిగామ మండలాలు కూడా ఇప్పుడు తెదేపా వైపు మొగ్గు చూపుతున్నాయి. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో మద్దతు మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు సొంతింట్లోనే అసమ్మతి ఉంది. జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న ఆయన భార్య వాణి దువ్వాడకు వ్యతిరేకంగా గళమెత్తడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమయింది. మొన్నటి వరకు వైకాపాలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్‌లో చేరి, బరిలో నిలిచారు. ఆమె ఎన్ని ఓట్లు చీల్చినా అవన్నీ దువ్వాడకు నష్టం కలిగించేవే అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ తన సామాజికవర్గం మద్దతు దక్కుతుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో డబ్బులు విపరీతంగా వెదజల్లుతున్నారు. నియోజకవర్గంలో వైకాపా నాయకుడి అరాచకాలు   తెదేపాకు కలిసి వస్తున్నాయి.


బగ్గు రమణమూర్తికే మొగ్గు

నియోజకవర్గం: నరసన్నపేట

మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఆయన కుటుంబసభ్యుల వ్యవహారశైలిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత తెదేపాకు కలిసివస్తోంది. మంత్రిగా పని చేసినా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్‌ నామమాత్రంగా మారిపోయారని, ఆయన భార్య, కుమారులు, వ్యక్తిగత సహాయకులే మొత్తం హల్‌చల్‌ చేశారన్నది జనం మాట. వంశధార నదిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాల్లో ఆరోపణలు, బదిలీలు, భూముల వ్యవహారాల్లో కృష్ణదాస్‌ కుటుంబసభ్యులు, పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వంశధార ప్రాజెక్టు తెదేపా హయాంలోనే సింహభాగం పూర్తయినా వైకాపా ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయింది. కాలువల్లో నీరు పారించలేకపోయింది. దీంతో నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ధర్మాన కుటుంబం, వారి అనుచరుల ఏకఛత్రాధిపత్యం వైకాపా నాయకులకూ రుచించలేదు. సారవకోట మండలాధ్యక్షుడు కూర్మి నాయుడు, జలుమూరు జడ్పీటీసీ సభ్యుడు శాంతి, డీసీసీబీ ఛైర్మన్‌ కుమారుడు డోల జగన్‌ వైకాపాను వదిలి తెదేపాలో చేరారు. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తికి నియోజకవర్గంలో సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. జడ్పీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన హయాంలో వంశధార పనులు వేగంగా జరిగాయి. రూ.12 కోట్లతో ఆస్పత్రి మంజూరు చేయించి 60 శాతం పనులు పూర్తి చేయించారు. ఇవన్నీ ఇప్పుడు కలిసొస్తున్నాయి.


అవాంతరాలు దాటి గట్టి పోటీ ఇస్తున్నతెదేపా

నియోజకవర్గం: పాతపట్నం

ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, పార్టీలో కీలక నాయకుల ఫిరాయింపులు వైకాపాను ఇబ్బంది పెడుతున్నాయి. తెదేపా అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని కలిసికట్టుగా అడుగులు వేస్తోంది. ఈ నియోజకవర్గంలో తొలుత హోరాహోరీగా ఉన్నా.. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ తెదేపాకు ముందుకెళుతోంది. ఇక్కడ అభ్యర్థిత్వం ఆశించిన కలమట వెంకటరమణను పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడారు. ఆయనకు శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. లోక్‌సభ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు ఇక్కడి నాయకులు కలిసి పని చేసేలా అవగాహన కుదిర్చారు. వైకాపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్థానికురాలు కారు. ఆమె తీరుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులే బహిరంగంగా గళం వినిపించినా, ఆమెకు కాకుండా ఎవరికి టికెటిచ్చినా మద్దతు పలుకుతామని చెప్పినా అధిష్ఠానం పట్టించుకోలేదు. రెడ్డి శాంతికే మళ్లీ టికెటివ్వడంతో కొత్తూరు మండల ఉపాధ్యక్షులు లోతుగడ్డ తులసీ వరప్రసాద్‌, హిరమండలం మండలాధ్యక్షురాలు మేనక తెదేపాలో చేరిపోయారు. రెడ్డి శాంతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడమూ ప్రతికూలంగా ఉంది. వంశధార ప్రాజెక్టు పూర్తి చేయలేదు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. గిరిజన ప్రాంతానికి ఐటీడీఏను ఏర్పాటు చేయించలేకపోయారు. ధన ప్రవాహంతో మద్దతు కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

  • శ్రీకాకుళం నియోజకవర్గంలో సీనియర్‌ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావుకు తెదేపా అభ్యర్థి గొండు శంకర్‌ గట్టి సవాల్‌ విసురుతున్నారు. వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత, యువకుల్లో పట్టు కలిసొస్తున్నాయి.
  • పలాసలో మరో మంత్రి అప్పలరాజుపై తెదేపా అభ్యర్థి గౌతు శిరీష హోరాహోరీ పోరాడుతున్నారు.
  • ఆమదాలవలస నియోజకవర్గంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం గెలవడం కష్టమేనన్న ప్రచారం తీవ్రస్థాయికి చేరింది. ఆయన తన మేనల్లుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

తెదేపా పట్టు, జనసేన బలం కీలకాంశాలు

నియోజకవర్గం: ఇచ్ఛాపురం

ఈ నియోజకవర్గం తెదేపాకు కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఓటమిపాలయింది. పార్టీకి ఉన్న ఆ బలమే ఈసారి కూడా అభ్యర్థి బెందాళం అశోక్‌కు అనుకూలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి జగన్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తోడవుతోంది. ఇచ్చాఫురం మున్సిపాలిటీ, మండలం, కవిటి మండలాల్లో తెదేపాకు పట్టుంది. గతంలో సోంపేటలో తెదేపాకు పట్టు ఉన్నా కిందటి ఎన్నికల్లో వైకాపాకు మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం పోటాపోటీగా మారింది. అన్ని మండలాల్లోనూ వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలోకి వస్తున్నారు. జనసేనతో పొత్తు కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. సంఖ్యాపరంగా రెండో పెద్ద సామాజికవర్గమైన వ్యక్తి జనసేన నాయకుడిగా యువతను కదిలించి గట్టిగా పనిచేస్తుండటం అశోక్‌కు అనుకూలంగా మారుతోంది. వైకాపా అభ్యర్థి పిరియా విజయ నియోజకవర్గంలో బాగా తిరిగారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో క్యాడర్‌ బలం పెంచుకున్నారు. నియోజకవర్గంలో ఆమె పెద్దగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేమీ లేవు. అందుకే డబ్బు బాగా ఖర్చు చేస్తున్నారు. గ్రామస్థాయి నాయకులు చేజారిపోకుండా డబ్బులు వెదజల్లుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img