Vijay Bulganin: కమెడియన్ల చిత్రాలకు సంగీతమందిస్తానని నాపై ముద్ర వేశారు!

ఇటీవల కాలంలో విడుదలకు ముందే పాటలతో సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న చిత్రం ‘బేబి’.

Updated : 23 Jul 2023 13:58 IST

ఇటీవల కాలంలో విడుదలకు ముందే పాటలతో సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న చిత్రం ‘బేబి’. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి విజయ్‌ బుల్గానిన్‌ స్వరాలు సమకూర్చారు. సాయి రాజేష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విలేకర్లతో ముచ్చటించారు సంగీత దర్శకుడు విజయ్‌. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత ప్రయాణ విశేషాల్ని పంచుకున్నారు.

‘ఈ చిత్రానికి తొలి హీరో నేనని అందరూ ప్రశంసిస్తున్నారు. నిజానికి నేను కాదు. సాయి రాజేష్‌ అడగకపోతే నేనింత మంచి సంగీతం ఇచ్చే వాడిని కాదేమో. ఈ విషయంలో పూర్తి క్రెడిట్‌ ఆయనదే. ఈ కథ విన్నాక నేను ముందుగా దీంట్లో కష్టంగా ఉన్న పాట చేయాలనుకున్నా. ప్రీక్లైమాక్స్‌కు ముందొచ్చే ‘ప్రేమిస్తున్నా’ పాట చేయమన్నారు రాజేష్‌. దాన్ని రెండు మూడు రోజుల్లోనే చేసిచ్చా. అలాగే ‘‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’’ పాటను కూడా చాలా వేగంగానే పూర్తి చేసిచ్చా. నిజానికి ఈ చిత్ర పాటల్ని సిద్ధం చేయడానికి నాకు పెద్దగా టైమ్‌ పట్టలేదు.  ఈ సినిమా మ్యూజిక్‌ విషయంలో అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ ఇచ్చిన ప్రశంసలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే విజయ్‌ దేవరకొండ చెప్పిన మాటలు, నాని పంపిన సందేశం నాకెంతో ప్రత్యేకం. నిజానికి నా గత చిత్రాలకు కూడా నా బెస్ట్‌ ఇచ్చాను. కానీ, ఈ చిత్రం పెద్ద హిట్టవ్వడంతో నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది’’.

మంచి పాట ఎప్పటికీ ఆగిపోదు..

‘‘సంగీత దర్శకుడిగా నా తొలి సినిమా ‘వారధి’. తర్వాత సప్తగిరి హీరోగా చేసిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ తదితర చిత్రాలకు సంగీతమందించా. ఆ సమయంలో కమెడియన్‌ సినిమాలకు మ్యూజిక్‌ చేస్తాడంటూ నాపై ఓ ముద్ర వేశారు. దీంతో సరిగ్గా అవకాశాలు రాలేదు. దాంతో మళ్లీ ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌పై దృష్టి పెట్టి.. సొంతంగా పాటలు చేశా. వాటి ద్వారా మళ్లీ అవకాశాలొచ్చాయి. నేను నమ్మేది ఒకటే.. మంచి పాట అనుకున్నది ఎప్పటికీ ఆగిపోదు. అదెప్పటికైనా ప్రజల మనసుల్లోకి వెళ్తుంది. మెలోడీ పాటను చేయగలిగితే.. ఏ పాటనైనా కంపోజ్‌ చేయగలమనేది నా నమ్మకం. మాస్‌ పాటలోనైనా మెలోడీ ఉంటేనే ఎక్కువ రోజులు గుర్తుంటుందని నా అభిప్రాయం’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని