Updated : 28/11/2021 05:24 IST

Akhanda: ‘అఖండ’ జ్యోతిలా పరిశ్రమకి వెలుగునివ్వాలి

వైవిధ్యమైన పాత్రల్ని చేస్తూ... ముందు తరానికి బాటలు వేసే అవకాశం కలిగినందుకు సదా కృతజ్ఞతతో ఉంటానన్నారు నందమూరి బాలకృష్ణ. నా వెన్ను తడుతూ, నాకు ధైర్యాన్నిస్తూ సాహసోపేతమైన ప్రయత్నాలకి అండగా నిలుస్తున్న అభిమానులు ఉన్నందుకు గర్వపడతానన్నారు. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘అఖండ’. ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ కథానాయికలు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, సోదరుడు నందమూరి రామకృష్ణ, సోదరి లోకేశ్వరి వేడుకకి ఆకర్షణగా నిలిచారు. వేడుకని ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘తమ్ముడు అల్లు అర్జున్‌, దర్శకుడు రాజమౌళి వేడుకకి హాజరు కావడం ఆనందంగా ఉంది. దీన్ని బాలకృష్ణ సినిమా, బోయపాటి సినిమా అని కాకుండా... ఒక పండగలా భావిస్తారు అభిమానులు. మాటల్లో ఒక శక్తి ఉంటుంది. తొమ్మిది పూజా విధానాలకీ, ఈ కథకీ సంబంధం ఉంది. నా సినిమా ఒక్కటే కాదు, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ లాంటి పెద్ద సినిమాలతోపాటు అన్ని చిన్న సినిమాలూ విజయవంతం కావాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమకి సహకారం అందించాల’’ని కోరారు.

* కథానాయకుడు అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘నందమూరి కుటుంబానికీ, అల్లు కుటుంబానికీ ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. మా తాత అల్లు రామలింగయ్యకి రామారావు అంటే ఎంతో ఇష్టం. ఆయన ఇంట్లో ఆయన వంటింటికీ వెళ్లే చొరవ ఆయనది. తండ్రిలాంటి బాలకృష్ణ గారి వేడుకకి రావడం ఆనందంగా ఉంది. బోయపాటి శ్రీను తొలి సినిమా చేయకముందు నుంచే పరిచయం. ‘భద్ర’ కథ చెప్పారు. అది మేం ఇద్దరం కలిసి చేయాలి కానీ, నేను ‘ఆర్య’ కోసం వెళ్లా. తర్వాత నాకోసం మరో మెట్టు ఎక్కే సినిమా ‘సరైనోడు’ ఇచ్చారు. ఈ సినిమాకి ప్రధాన సాంకేతిక నిపుణుడు తమన్‌. తను పట్టుకుందల్లా బంగారం అవుతోంది. రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా అఖండమైన విజయం సాధించాలి. శ్రీకాంత్‌ అన్నయ్య సున్నితమైన వ్యక్తి అయినప్పటికీ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రం నుంచి కొత్త శ్రీకాంత్‌ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాచకం అనేది మహానుభవాలు ఎన్టీఆర్‌ గారికి కుదిరింది, ఆ తర్వాత తరంలో అంతే అద్భుతంగా బాలకృష్ణ ఒక్కరికే కుదిరింది. ఈ సినిమా అఖండ జ్యోతిలాగా తెలుగు చిత్రపరిశ్రమకి వెలుగునివ్వాలి’’ అన్నారు.

* నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘2020 మార్చికి ముందు థియేటర్లో సినిమా చూడటమనే ఆనవాయితీ ఎలా ఉండేదో, దాన్ని ఈ సినిమాతో పునః ప్రారంభిస్తున్నాం. 17న వచ్చే ‘పుష్ప’తోనూ, ఆ తర్వాత చిత్రాలతోనూ కొనసాగుతుంది’’ అన్నారు.

* బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో నాకు తెలుసు. హ్యాట్రిక్‌ సినిమా అవుతుంది. జై బాలయ్య పాట కోసం ప్రాక్టీస్‌ చేస్తూ బాలకృష్ణ చేతికి గాయమైంది. ఈ పాట ఆపేద్దాం అనుకున్నాం. కానీ అభిమానుల కోసం ఈ మాస్‌ పాట చేయాల్సిందేనని ముందుకొచ్చారు బాలకృష్ణ’’ అన్నారు.

* ఈ కార్యక్రమంలో తమన్‌, ప్రగ్యాజైస్వాల్‌, శ్రీకాంత్‌, శివమణి, సాయి కొర్రపాటి, యలమంచిలి రవిశంకర్‌, గోపీచంద్‌ మలినేని, కల్యాణ్‌చక్రవర్తి, సాయికృష్ణ, స్టన్‌ శివ, కెవిన్‌, స్టీవెన్‌, రామ్‌ప్రసాద్‌, ఎ.ఎస్‌.ప్రకాశ్‌, రత్నం, జేష్ణవి, బేబి తేష్ణ,  ప్రత్యూష, శంకర్‌, భాను, నవీనారెడ్డి, ఎస్పీ చరణ్‌, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.


ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా పరిశ్రమంతటికీ ఓ ఊపు తెప్పించారు. బాలయ్య బాబు ఒక ఆటంబాంబ్‌. ఆ బాంబ్‌ని సరిగ్గా ఎలా ప్రయోగించాలో బోయపాటి శ్రీనుకి తెలుసు. తొలి రోజు, తొలి ఆటని థియేటర్‌లో చూస్తా’’ అన్నారు.


 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని