Published : 01 Jul 2022 01:36 IST

కొత్త చిత్రానికి శ్రీకారం

రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా తేజ మర్ని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌, విద్య మాధురి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. శ్రీకాంత్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, మురళి శర్మ, బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు. బేబీ హన్విక కెమెరా స్విచ్చాన్‌ చేసింది. అనంతరం దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘బలమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. రాహుల్‌, శివాని జోడీ ఆకట్టుకునేలా ఉంటుంద’’న్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌, ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి.


ఎవడు వాడు?

కార్తికేయ, అఖిల నాయర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘వాడు ఎవడు’. ఎన్‌.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.  ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘టీజర్‌ చూశా. చాలా బాగుంది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఘన విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మహిళల అందమైన జీవితాలు సమాజంలోని కొన్ని అసాంఘిక శక్తుల వల్ల ఎలా అర్ధంతరంగా ముగుస్తున్నాయో ఇందులో చూపించాం’’ అన్నారు కథా రచయిత రాజేశ్వరి పాణిగ్రహి. చిత్ర దర్శక నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాతో సమాజానికి మంచి సందేశం ఇవ్వనున్నాం. మూడు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి’’ అన్నారు.


‘భీమదేవరపల్లి బ్రాంచి’లో ఏం జరిగింది?

సుధాకర్‌ రెడ్డి,  కీర్తిలత, అభిరామ్‌, రూప ప్రధాన పాత్రల్లో రమేశ్‌ చెప్పాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. బత్తిని కీర్తిలత గౌడ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలోని మల్లాపూర్‌ గ్రామంలో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్య చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా తెరకెక్కిస్తున్నాం. ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. దాని ఆధారంగానే ఇప్పుడీ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. సంగీతం: చరణ్‌ అర్జున్‌, ఛాయాగ్రహణం: చిట్టిబాబు.


అందరికీ నచ్చే ‘షికారు’

సాయి ధన్సిక, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మేడిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘షికారు’. హరి కొలగాని దర్శకుడు.    పి.ఎస్‌.ఆర్‌.కుమార్‌(బాబ్జి) నిర్మాత. కె.వి.ధీరజ్‌, చమ్మక్‌ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘అభి, తేజ, ధీరజ్‌.. అందరూ   బాగా చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో మంచి కథతో పాటు చక్కటి కామెడీ ఉంది’’ అంది నటి సాయి ధన్సిక. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘అహల్య గురించి అందరికీ తెలుసు. ఈ ‘షికారు’’ కథ  అలాంటిదే. ఈ చిత్రానికి సాయి ధన్సిక పాత్ర వెన్నుముక. కథని నడిపించింది ఆమే. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్‌, ప్రసన్న కుమార్‌, డి.ఎస్‌.రావు, విశ్వకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts